Mohammed Deif: హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దక్షిణ గాజాలో శనివారం కనీసం 71 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ సమీపంలోని భవనంలో డీఫ్ దాక్కున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అన్నది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
దక్షిణ ఇజ్రాయెల్‌లో 1,200 మందిని చంపి, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి కారణమైన హమాస్ నేతృత్వంలోని అక్టోబర్ 7 దాడి వెనుక డెయిఫ్ ప్రధాన సూత్రధారి అని నమ్ముతారు. అతను గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. గతంలో అనేక పర్యాయాలు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకున్నాడు. ఇలా ఉండగా తాజా దాడిలో 71 మంది మరణించగా 289 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో గాజాలో 38,000 మందికి పైగా మరణించగా 88,000 మందికి పైగా గాయపడ్డారు, జనాభాలో ఎక్కువ మందిని వారి ఇళ్ల నుండి బయటకు తరిమికొట్టారు.
మహమ్మద్ డెయిఫ్ ఎవరంటే..( Mohammed Deif)
హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ 1965లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో మహమ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్-మస్రీగా జన్మించాడు, అతని కుటుంబ సభ్యులు కొందరు అప్పుడప్పుడు సాయుధ పాలస్తీనియన్ల దాడులలో పాల్గొన్నారు. డెయిఫ్ ఇజ్రాయెల్ సైనికులు మరియు పౌరులను చంపిన పలు ఆత్మాహుతి బాంబు దాడులకు నాయకత్వం వహించాడు. 1996లో, డెయిఫ్ నిర్వహించిన బస్సు బాంబు దాడుల్లో 50 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. అతను 2001లో అరెస్టు చేయబడి విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత, డెయిఫ్ రెండవ సారి ఘోరమైన బాంబు దాడులను నిర్వహించి పలువురు ఇజ్రాయెల్ పౌరుల ప్రణాలను బలిగొన్నాడు. అతను 2002లో హమాస్ మిలటరీ విభాగానికి నాయకుడు అయ్యాడు. గత ఏడాది అక్టోబర్ 23న ఇజ్రాయెల్ పై ఆపరేషన్ అల్-అక్సా స్టార్మ్ గా పిలవబడే దాడికి కూడా అతను నాయకత్వం వహించాడు.