Pakistan Inflation: పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. ఏకంగా 37.97 శాతానికి ఎగబాకింది. గత ఏడాది మే 2022తో పోల్చుకుంటే ఈ ఏడాది రవాణా ఖర్చులతో పాటు నాన్ పెరిషబుల్‌గూడ్స్ ధరల ఏకంగా 50 శాతంగాపైనే ఎగబాకాయి. గత 12 నెలల కాలానికి చూస్తే సరాసరి ద్రవ్యోల్బణం 29.16 శాతంగా నమోదయింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే మే నెలలో ద్రవ్యోల్బణం 37.97 శాతంగా నమోదైందని గురువారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి నడిసంద్రంలో చిక్కుకున్న నావలా తయారైంది. ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా ఉంటే .. మరో వైపు ఐఎంఎఫ్ ఇస్తామన్న బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వడానికి నానా షరతులు విధిస్తూ పాక్ పాలకులకు చుక్కలు చూపిస్తోంది.
పేదలు, మధ్యతరగతికి ఇబ్బందులు..(Pakistan Inflation)
నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటే త్వరగా చెడిపోని వస్తువుల విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో 50 శాతంపైనే పెరిగింది. గత 12 నెలలకు గాను సరాసరి ద్రవ్యోల్బణం 29.16 శాతంగా నమోదైందని పాకిస్తాన్ బ్యూర్ ఆఫ్ స్టాట్సిటిక్ తాజాగా విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని చూస్తే.. పేదల సంగతి పక్కన పెడితే మధ్య తరగతి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలలో, బంగాళదుంపలు, గోధుమ పిండి, టీ, గోధుమలు మరియు గుడ్లు మరియు బియ్యం గత సంవత్సరంతో పోలిస్తే మేలో అత్యధికంగా ధరలు పెరిగాయి. ఆహారేతర విభాగంలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, మోటార్ ఇంధనాలు, వాషింగ్ సబ్బులు, డిటర్జెంట్లు, అగ్గిపెట్టెలు అత్యధికంగా పెరిగాయి.పాకిస్తాన్‌లో ఇంతకు ముందు ఏప్రిల్‌లో నమోదైన అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం 36.4 శాతం. వినియోగదారుల ధరల సూచీలో తాజా పెరుగుదలతో, ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో (జూలై నుండి మే వరకు) సగటు ద్రవ్యోల్బణం 29.16 శాతంగా ఉంది, ఇది అంతకు ముందు సంవత్సరంలో 11.29 శాతంగా ఉంది.
ఆర్దిక క్రమశిక్షణ లేకపోవడంతో..
పాకిస్తాన్‌ను పాలించిన పాలకులు ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్య తలెత్తింది. దీని ప్రభావం పేద దేశాలపై తీవ్రంగా ఉంది. దీనికి తోడు గత ఏడాది పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు దేశంలోని మూడొంతల భాగం నీట మునిగిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజకీయ సంక్షోభం మరో వైపు … గత నెల 9వ తేదీన మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనలు కాస్తా హింసకు దారితీశాయి. దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. వరుసగా పిటిఐ నాయకుల అరెస్టు పర్వం కొనసాగడంతో పాటు ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని జైళ్లకు పంపారు.