India military Budget: చైనా సరిహద్దు వెంబడి తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన భారతదేశం, 2022లో మిలటరీకి ఖర్చు పెట్టిన దేశాల్లో 4వ స్దానంలో నిలిచింది. సౌదీ అరేబియా ఐదో స్థానంలో నిలిచింది. యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యా, మొదటి మూడు స్దానాల్లో నిలిచాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్( సిప్రి) నివేదిక తెలిపింది.
ప్రతి ఏటా పెరుగుతున్న మిలటరీ బడ్జెట్..(India military Budget)
భారత సైనిక వ్యయం 81.4 బిలియన్ డాలర్లు ప్రపంచంలోనే నాల్గవ అత్యధికంగా ఉంది. ఇది 2021 కంటే 6% ఎక్కువ మరియు 2013 నుండి 47% పెరిగింది. 2022లో చైనాతో వివాదాస్పద సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు సాయుధ బలగాలకు పరికరాలను మెరుగుపరచడానికి భారతదేశం చేస్తున్న ఖర్చు మొత్తం సైనిక వ్యయంలో 23% అని నివేదిక పేర్కొంది.భారతదేశం గత ఏడాది బడ్జెట్‌లో సైనిక వ్యయం కోసం రూ.5.25 లక్షల కోట్లు, 2021-22లో రూ4.78 లక్షల కోట్లు కేటాయించింది. అంతకు ముందు ఏడాది రూ.4.71 లక్షల కోట్లు కేటాయించింది.
స్వావలంబనకు ప్రత్యేక చర్యలు..
రక్షణ రంగంలో స్వావలంబనను పెంపొందించేందుకు భారత్ గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకుంది. స్థానికంగా తయారు చేయబడిన మిలిటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 49% నుండి 74%కి పెంచడం మరియు దిగుమతి చేసుకోలేని వందలాది ఆయుధాలు మరియు వ్యవస్థలను తెలియజేయడం,రాబోయే ఐదు నుండి ఆరు వరకు దేశీయంగా రూపొందించడానికి ప్రణాళిక చేయడం వంటివి ఉన్నాయి.
మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2022లో 3.7% పెరిగి, $2,240 బిలియన్ల కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ప్రపంచ సైనిక వ్యయంలో ఐదు దేశాలు 63% వాటాను కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం గత ఏడాది వ్యయంలో వృద్ధికి ప్రధాన చోదకమని సిప్రి నివేదిక పేర్కొంది.