Hamas Hostages: ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.
బరువు తగ్గిన బందీలు.. ( Hamas Hostages)
విడుదలైన బందీలు ఎవరూ తమను ఏ పరిస్థితులలో ఉంచారో ఇప్పటివరకు చెప్పలేదు. బందీలుగా ఉన్నపుడు తమ పరిస్థితుల గురించి వివరాలను వెల్లడించకుండా ఉండమని ఆదేశించినట్లు ఆసుపత్రులు చెబుతున్నాయి.కానీ వారికి చికిత్స చేస్తున్న వైద్య నిపుణుల నుండి కొన్ని వివరాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి.విడుదలైన 17 మంది థాయ్ జాతీయులు చికిత్స పొందిన షామీర్ మెడికల్ సెంటర్‌లోని వైద్య బృందం అధిపతి రోనిత్ జైడెన్‌స్టెయిన్, బందీలకు సరైన ఆహారం ఇవ్వలేదని చెప్పారు.కొద్దిపాటి అన్నం, చిక్కుడు గింజలు, డబ్బాలలో నిల్వ చేసిన ఆహారాన్ని ఇచ్చే వారని అందుకే పోషకాహార లేమితో బాధపడ్డారని చెప్పారు. మా వద్దకు వచ్చిన వ్యక్తులు చాలా తక్కువ సమయంలో10 శాతం లేదా అంతకంటే ఎక్కువ బరువును కోల్పోయారన్నారు. వోల్ఫ్సన్ మెడికల్ సెంటర్‌లోని వైద్యురాలు కొంతమంది బందీలను భూగర్భంలో ఉంచినట్లు వివరించారు. వారిని వెలుతురులో కేవలం రెండు గంటలు మాత్రమే ఉంచారని తెలిపారు. సోమవారం విడుదలైన 12 ఏళ్ల ఫ్రెంచ్ బాలుడు ఐటాన్ యహలోమిని చీకటిగదిలో 16 రోజులపాటు తనను ఒంటరిగా నిర్భందించారని, బాంబుల శబ్దానికి ఎంతగానో భయపడ్డానని చెప్పాడు. పెన్సిల్ లేదా పెన్నుతో రాసుకుంటానని అడిగినప్పుడు కూడా, హమాస్అనుమతించలేదు. ఎందుకంటే వారు సమాచారాన్ని వ్రాతపూర్వకంగా ప్రసారం చేస్తారని భయపడ్డారు.బందీల పరిస్దితి అక్కడ హృదయవిదారకంగా ఉందని చెబుతున్నారు.