Narges Mohammadi: ప్రస్తుతం ఇరాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గిస్ మొహమ్మది సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. నర్గిస్ మొహమ్మది ఇరాన్ సంప్రదాయాలకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.
న్యాయ పోరాటం చేస్తున్న ఆమెను అరెస్టు చేసి జైలు శిక్ష విధించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న నర్గిస్.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు. మహిళలు హిజాబ్ ధరించడం ఇరాన్ సంప్రదాయం. దీనిని వ్యతిరేకించే ఆమెకు.. హిజాబ్ ధరించి ఆస్పత్రికి వెళ్లాలని జైలు అధికారులు షరతు విధించారు. దీనికి ఆమె అంగీకరించక జైలులోనే దీక్ష చేపట్టినట్లు స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.
నర్గిస్‌కు వైద్య సేవలను నిరాకరించడంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ స్పందించింది. ఆస్పత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన అమానవీయమని ప్రకటనలో పేర్కొంది. ఇది అనైతికమని.. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను కోరింది. ఇదిలా ఉండగా మహిళా హక్కుల కోసం తన గళమెత్తిన నర్గిస్ ఇప్పటివరకు 13 సార్లు అరెస్టు అయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నర్గిస్ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. ఆమె చేస్తున్న పోరాటానికి గానూ అక్టోబరు 6న ఆమె నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.