Pakistan: పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తేదీని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశంలోని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఈసీపీ తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణ తేదీని కోర్టుకు తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి 29 నాటికి నియోజకవర్గాల పునర్విభజన అంశం ఓ కొలిక్కి వస్తుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది సజీల్ స్వాతి తెలిపారు. జాతీయ అసెంబ్లీ, ప్రావిన్షియల్ లెజిస్లేచర్‌ను రద్దు చేసిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణను న్యాయస్థానం పునః ప్రారంభించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగే తీరును.. ఈసీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పాక్‌లో 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం రద్దయింది. అప్పటి నుంచి ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఆ తరువాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ ఈ ఏడాది ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానితో సింధ్, బలూచిస్థాన్ అసెంబ్లీలు కూడా ముందస్తుగానే రద్దయిపోయాయి. నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అధికారికంగా ఓటర్ల జాబితా విడుదల తర్వాత పోలింగ్ తేదిని ప్రకటిస్తామని వెల్లడించింది.