Elon Musk Meet Modi: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్‌లో పీఎం మోడీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మస్క్ తాను ప్రధాని మోడీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను భారత్‌ను సందర్శిస్తానని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారత్‌లోనే ఉద్యోగ, వ్యాపారమే కాక అన్ని రంగాల్లోనూ ఎక్కువ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని భారతదేశ భవిష్యత్తు గురించి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన వివరించారు. ఇకపోతే ప్రధానమంత్రి మోడీపై ప్రశంసల జల్లు కురింపించారు మస్క్. భారతదేశ అభివృద్ధి గురించి మోదీ చాలా బాగా శ్రద్ధ వహిస్తారని.. పెట్టుబడులు పెట్టడానికి తమను ఎంతగానో ప్రోత్సహిస్తారని మస్క్ తెలిపారు.
భారత్‌కు స్టార్‌లింక్(Elon Musk Meet Modi)
ఈ నేపథ్యంలోనే స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. దేశంలోని నలుమూలలకు ఇంటర్నెట్ సేవలందించే దిశగా ఈ స్టార్ లింక్స్ పనిచేస్తుందని ఆయన వివరించారు. ఇంటర్నెట్ సేవలు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది చాలా సహాయపడుతుందన్నారు ట్విట్టర్ సీఈవో అన్నారు. ఇకపోతే మస్క్‌తో పాటు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత నీల్ డి గ్రాస్సే టైసన్, నోబెల్ అవార్డు గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్ తదితరులు మోడీని కలిశారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కాగా జూన్ 22న మోడీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ తరుణంలో భారత్ పీఎం నరేంద్రమోదీ అమెరికా దేశ పర్యటనను ఉద్దేశించి వైట్ హౌస్ బుధవారం ఓ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని పేర్కొనింది.