Pakistan Electricity Bills: పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారి విద్యుత్ చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహం కాస్తా ప్రజలను రోడ్డుపైకి తెచ్చేలా చేసింది. విద్యుత్ బిల్లులు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెంచిన విద్యుత్ బిల్లులపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
పెషావర్, కరాచీ, లాహోర్, ముల్తాన్ మరియు రావల్పిండితో సహా అనేక నగరాల్లో గత వారం నిరసనలు ప్రారంభమయ్యాయి, మే నుండి తక్కువ మరియు మధ్యతరగతి కుటుంబాలకు సగటు విద్యుత్ ధర రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అటాక్, క్వెట్టా, తౌన్సా, హైదరాబాద్, నవాబ్షా, రహీమ్ యార్ ఖాన్ మరియు ముల్తాన్ వంటి ఇతర నగరాల్లో కూడా నిరసనలు జరిగాయి.లాహోర్‌లో పలుచోట్ల విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులపై దాడులు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.నిరుద్యోగం అధిక ద్రవ్యోల్బణంతో తాము ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని నిరసనకారులు జూలైలో అధిక విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరించారు. అనేక నగరాల్లో, ప్రజలు వేలాది కరెంటు బిల్లులను తగులబెట్టి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు మసీదుల నుండి ప్రకటనలు కూడా జారీ అయ్యాయి. స్థానికులు తమ బిల్లులు చెల్లించవద్దని మరియు అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.తాజాగా ఫైసలాబాద్‌లో ఇద్దరు పిల్లల తండ్రికి 40వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని బట్టి చూస్తే ప్రజలు విద్యుత్ బిల్లుల పట్ల ఎంత వణికిసోతున్నారో తెలుస్తోంది.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, విద్యుత్ చార్జీల తగ్గింపుపై ఆలోచన చేయాలని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీకాలం ఈ నెల ప్రారంభంలో పూర్తి కావడంతో ప్రస్తుతం పాకిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. మరోవైపు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రతిపాదిత చర్యల జాబితాను ఇంధన మంత్రిత్వ శాఖ ఖరారు చేసిందని, దీనిని ఆమోదం కోసం ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో సమర్పించనున్నట్లు దేశ తాత్కాలిక సమాచార మంత్రి ముర్తాజా సోలంగి మంగళవారం తెలిపారు. పాకిస్తాన్ నేషనల్ ఎలక్ట్రిక్ పవర్ రెగ్యులేటరీ అథారిటీ (NEPRA) గత నెలలో యూనిట్‌కు రూ. 4.96 చొప్పున సుంకాలను పెంచడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. జూన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ద్వారా 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌కు పాకిస్తాన్ అంగీకరించిన షరతులలో భాగంగా ఈ పెంపు జరిగింది. ఐఎంఎఫ్ పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్‌ను కోరింది. ఆర్థిక క్రమశిక్షణను పెంచడానికి అనేక సంస్కరణలు చేపట్టాలని ఆదేశించింది. ఎనిమిది నెలల కఠిన చర్చల తర్వాతే బెయిలౌట్ ఒప్పందంపై సంతకం చేయగలిగారు.