Pakistan: ఎకానమీ క్లాస్‌ ప్రయాణాలు.. సాధారణ హోటళ్లలో బసలు.. పాకిస్తాన్ మంత్రులకు ప్రభుత్వం అదేశాలు..

ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్‌ క్లాస్‌లో కాకుండా ఎకనమి క్లాస్‌లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో కాకుండా సాధారణ హోటల్‌లో దిగాలని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 04:53 PM IST

Pakistan: ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్‌ క్లాస్‌లో కాకుండా ఎకనమి క్లాస్‌లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో కాకుండా సాధారణ హోటల్‌లో దిగాలని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.

లగ్జరీ లైఫ్ కు స్వస్తి చెప్పాలి.. (Pakistan)

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌. పొదుపుమంత్రం పాటిస్తామని బుధవారం నాడు చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 6.5 బిలియన్‌ డాలర్ల బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీ కోసం ప్రభుత్వం 764 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పారు. ఇస్లామాబాద్‌లో ఆయన కేబినెట్‌ సమావేశంలో మాట్లాడారు. తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు. దేశం కోసం మన ప్రజల కోసం కొన్ని త్యాగాలను చేయాలన్నారు షరీఫ్‌. మంత్రులు విలాసవంతమైన జీవితాలకు స్వస్తి పలికి సాధారణ జీవితం గడపాలని సూచించారు. ఇక నుంచి కేబినెట్‌ మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌లో కాకుండా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాలని సూచించారు. అలాగే ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బస చేయకుండా సాధారణ హోటళ్లలో బస చేయాలని తన సహచర మంత్రులకు సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా మంత్రుల నుంచే పొదుపు చర్యలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో ఫెడరల్‌ మంత్రులతో పాటు రాష్ట్ర స్దాయి మంత్రులు.. ఉన్నత స్థాయి ప్రభుత్వం అధికారులు కూడా స్వచ్చందంగా తమ వేతనాలతో పాటు భత్యాలు వదులుకోవడానికి ముందుకు వచ్చారు. వారిని షెహబాజ్‌ అభినందించారు. కాగా ప్రభుత్వం లగ్జరీ వస్తువులతో పాటు లగ్జరీ కార్లను కొనుగోలు వచ్చే ఏడాది వరకు రద్దు చేసింది.

కేవలం మూడు బిలియన్ డాలర్ల  విదేశీ మారక ద్రవ్యం..

పాకిస్తాన్‌ పార్లమెంటు ఈ వారం సమావేశమై విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విలాసవంతమైన వస్తువులపై భారీ పన్నును వడ్డించింది. ఐఎంఎఫ్‌ చెప్పినట్లు ఇంధన చార్జీలను కూడా పెంచేసింది. ఇదిలా ఉండగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ పాకిస్తాన్‌ గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 725 బేసిస్‌ పాయింట్లు వడ్డీరేట్లు పెంచేసింది. కాగా వచ్చే నెల మార్చి 16 తేదీన పాకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంకు ద్రవ్యపరపతి సమీక్ష నిర్వహించనుంది. మరోమారు వడ్డీరేట్లు పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 350 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంకు వద్ద కేవలం మూడు బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే ఉంది. ఈ జులైలోగా పాకిస్తాన్‌ విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అసలు వడ్డీతో కలిసి సుమారు 542.5 మిలియన్‌ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేదంటే డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వంద బిలియన్ డాలర్లపైనే ఉన్న అప్పులు..

కాగా పాకిస్తాన్‌ విదేశీ అప్పులు సుమారు వంద బిలియన్‌ డాలర్ల పై మాటే. కాగా ఈ ఏడాది పాకిస్తాన్‌ 542.5 మిలియన్‌ డాలర్ల అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. అలాగే 2051 నాటికి మేచురిటీ అయ్యే 8 బిలియన్‌ డాలర్ల బాండ్లతో పాటు మిగిలిన అప్పులపై వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బిలియన్‌ డాలర్ల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాక్‌ తీసుకున్న అప్పులు ప్రస్తుతం తిరిగి చెల్లించడానికి ఐఎంఎఫ్‌పై ఒత్తిడి తెచ్చి 1.2 బిలియన్‌ డాలర్లు తీసుకుంటే అప్పులు చెల్లించి డిఫాల్ట్‌ నుంచి తప్పుకోవచ్చనేది పాకిస్తాన్‌ ప్లాన్‌.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐఎంఎఫ్‌ కనికరించి రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి పాకిస్తాన్‌కు ప్రస్తుతానికి అచ్చే దిన్‌ వచ్చినట్లే అని చెప్పుకోవచ్చు.