Earth Quake : పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. పాక్‌లో భూకంపం దాటికి ఇద్దరు మహిళలు సహా ఇప్పటి వరకు 9 మంది, అఫ్గనిస్తాన్ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మరణించగా 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందుతుంది.
అఫ్గనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతం భూ ఉపరితలం నుంచి 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాట్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం నమోదైనట్లు పేర్కొంది. అదే విధంగా గుజ్రాన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, మద్ రంఝా, చక్వాల్, కోహట్, గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడయ్యింది.
Pashto TV channel Mahshriq TV during the earthquake. Bravo anchor continued his live program in the ongoing earthquake.
#earthquake #Peshawar pic.twitter.com/WC84PAdfZ6
— Inam Azal Afridi (@Azalafridi10) March 21, 2023
పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ తో పాటు భారత్, చైనా లో కూడా (Earth Quake)..
అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్‌తో పాటు, భారతదేశం, అఫ్గానిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కదలడంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు బయటకు పరుగులు తీశారు. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియరాలేదు. భూకంపం వల్ల జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల సేవలకు అంతరాయం కలిగింది. ఈ ప్రకంపనల కారణంగా నోయిడాలో పలు ఇళ్లలో సామగ్రి కింద పడింది.
భూకంప విపత్తుపై స్పందించిన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇస్లామాబాద్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2005లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంలో 74,000 మందికి పైగా మృతి చెందారు.