Dubai Leaks: పాకిస్తాన్‌ను ప్రస్తుతం దుబాయి ప్రాపర్టీ లీక్స్ నిలువునా వణికిస్తోంది. దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లాలు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మిలిటరీ, బ్యాంకర్లు, బ్యూరక్రసీకి చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. దుబాయిలోని సుమారు 23వేల అత్యంత ఖరీదైన స్థిరాస్తులను పాకిస్తాన్ పౌరులు కొనుగోలు చేశారని దుబాయి ప్రాపర్టీ లీక్స్ ద్వారా వెలుగు చూడ్డంతో పాక్ ప్రజలు షాక్ గురుయ్యారు. దేశంలోని మెజారిటీ ప్రజలు కడు పేదరికంలో మగ్గుతుంటే, దేశంలోని రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు వికీ లీక్స్ దుమారం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తాజాగా దుబాయిలో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారి వివరాలు దుబాయి లీక్స్ ద్వారా వెలుగు చూసింది. ప్రస్తుతం దుబాయిలో అత్యంత ఖరీదైన స్థిరాస్తులను కొనుగోలు చేసిన వారిలో ఇండియాన్స్ అగ్రస్థానంలో ఉన్నారు. సుమారు 35వేల స్థిరాస్తులను కొనుగోలు చేశారు. 2022 లెక్కల ప్రకారం చూస్తే వీటి విలువ 17 బిలియన్ డాలర్లుగా తేలింది. దుబాయిలో స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్ఫన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు, నార్వేంగ్వెన్ ఔట్‌లెట్ ఈ 24, 58 దేశాలకు చెందిన 74 మంది రిపోర్టర్లు దుబాయిలో స్థిరాస్తులు ఎవరూ కొనుగోలు చేశారనే అంశంపై కూపీ లాగారు. కాగా ఈ జాబితాలో శిక్షలు పడిన క్రిమినల్స్, చట్టం నుంచి పారిపోయిన నేరస్తులు, రాజకీయ నాయకులు తదితరులు దుబాయిలోని రియల్ ఎస్టేట్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేశారని వెల్లడించింది.
23వేల స్థిరాస్తులను కొన్న పాక్ పౌరులు..(Dubai Leaks)
ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ను తీసుకుంటే సుమారు 23వేల స్థిరాస్తులను పాకిస్తాన్‌కు చెందిన పౌరులు కొనుగోలు చేశారు. దుబాయిలో స్థిరాస్తులు కొనుగోలు చేసిన ప్రముఖల విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ ఆయన కుటుంబసభ్యులున్నారు. అలాగే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఇంటిరియర్ మినిస్టర్ మోహసిన్ నఖ్వీ భార్య , షేర్‌జిల్ మెమన్, సెనేటర్ పైసల్ వావ్వడా తో పాటు సింధ్, బలుచిస్తాన్ అసెంబ్లీకి చెందిన సభ్యులు ఉన్నారు. ఈ జాబితాలో మిలిటరీ డిక్టేటర్ పర్వేజ్ ముషారఫ్, మాజీ ప్రధానమంత్రి షౌకత్ అజీజ్‌తో పాటు రిటైర్డ్ జనరల్స్, పోలీస్ చీఫ్, ఒక రాయబారి, ఒక సైంటిస్టు దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లాలు కొనుగోలు చేశారు. వీరంతా ఈ స్థిరాస్తులను తమ పేరుపై కాకుండా తమ భార్యలు, లేదా పిల్లల పేర్లపై కొనుగోలు చేశారు.
పాక్ మంత్రి భార్యకు ఖరీదైన విల్లా..
ఇక అసలు విషయానికి వస్తే ఇంటిరియర్ మినిస్టర్ మోహసిన్ నఖ్వీ భార్యకు దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లా ఉంది. అయితే ఇటీవల జరిగిన నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసినప్పుడు ఈ ఆస్తుల గురించి ప్రస్తావించలేదు. అయితే విచారణలో తేలింది ఏమిటంటే కొంత మంది పాక్ పౌరులు హవాలా మార్గం ద్వారా దుబాయికి డబ్బు తరలించి అక్కడ విల్లాలు కొనుగోలు చేశారని. వారిలో హమీద్ ముఖ్తార్ షా, ఒక ఫిజిషన్ కూడా ఉన్నట్లు తేలింది. అయితే దుబాయి లీక్స్‌లో పాక్ పౌరులు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విషయానికి వస్తే స్టూడియో అపార్ట్‌మెంట్ నుంచి లావిష్ ఆరు బెడ్‌రూంల విల్లాలు కొనుగోలు చేశారు. వీరిలో రాజకీయ నాయకులు, మిలిటరీ, బిజినెస్ టైకూన్స్ ఉన్నారు. వీరంతా దుబాయిలోని ప్రీమియం లోకేషన్స్ దుబాయి మరీనా, ఇమారతి హిల్స్, పామ్ జుమేయిరాలో కొనుగోలు చేశారని దుబాయి లీక్స్‌లో వెలుగు చూసింది.
దుబాయిలీక్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ .. రంగంలోకి దిగింది. వాస్తవానికి చూస్తే పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్‌మెన్‌లు.. ఇక్కడ ఆదాయపు పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. తాజా దుబాయిలీక్స్ ద్వారా తమకు పూర్తి సమాచారం అందిన వెంటనే వీరి నుంచి రావాల్సిన పన్నులు వసూలు చేస్తామని ఎఫ్‌బీఆర్ చైర్మన్ మాలిక్ అమ్జాద్ జుబేయిర్ టివానా స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆయన చెప్పినట్లు దుబాయిలో ఆస్తులు ఉన్న వారి నుంచి అద్దెల రూపంలో వచ్చే ఆదామం నుంచి పన్ను వసూలు చేస్తామని చెబుతున్నారు. కానీ, ఆయన చెబుతున్నంత తేలికగా పన్నులు వసూలు కావు. అదీ కాకుండా దుబాయి అధికారులు పాకిస్తాన్ పౌరుల స్థిరాస్తుల గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి సహకరించరు.
పాకిస్తాన్ విషయానికి వస్తే .. ఇక్కడ దేశం దివాలా తీయడానికి సిద్దంగా ఉంది. దేశ జనాభాలో సగంపైనే ఎక్కువ మంది ఒంటి పూట తిండికి నోచుకోవడం లేదు. పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. బిలియన్ డాలర్ల అప్పు కోసం ఐఎంఎఫ్ వద్దకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అప్పు పుట్టనిదే పూట గడవని స్థితిలో పాక్ ఉంది. నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటి సామాన్యుడు విలవిల లాడిపోతున్నాడు. అదే రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఖజానాను లూటీ చేసి దుబాయిలో విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తున్నాడు. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు లా తయారైంది. అదే రాజకీయ నాయకులు .. మిలిటరీ జనరల్స్ మాత్రం విలాసవతంమైన జీవితాలను గడపుతున్నారు. మరోవైపు సామన్యుడు దయనీయమైన జీవితం గడుపుతుండటం అత్యంత విషాదం. గాడ్ సేవ్ పాక్ అనడం తప్పించి అక్కడి పౌరులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.