Russia-Ukraine war: రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అత్యంత సంపన్నులు గత ఏడాది అంటే 2022లో పది శాతం సంపద కోల్పోయారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడింది. ఉదాహరణకు శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల్లో పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచి గోధుమ ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. ఈజిప్టుతో పాటు పలు దేశాలు ఆహార కొరతతో ప్రజలు నకనకలాడుతున్నాయి.
ఇక ప్రపంచంలోని అత్యంత సంపన్నుల కష్టాల విషయానికి వస్తే వారి సంపదలో పది శాతం క్షీణించిపోయిందని నైట్ ఫ్రాంక్ అధ్యయనంలో తేలింది. అత్యధికంగా నష్టపోయిన దేశాల విషయానికి వస్తే యూరప్ సంపన్నుల సంపద 17 శాతం వరకు క్షీణించింది. అటు తర్వాత ఆస్ర్టేలియా సంపన్నుల సంపద 11 శాతం వరకు క్షీణించగా.. అమెరికా సంపన్నుల సంపద 10 శాతం వరకు క్షీణించగా.. ఆఫ్రికాతో పాటు ఆసియా దేశాల సంపన్నుల సంపద మాత్రం స్వల్పంగా కరిగింది. ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో పేర్కొంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల సంపద ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని గత ఏడాది పది శాతం కుంగిందని బుధవారం నాడు నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం తిరిగి కోలుకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల సంపద 10 శాతం లేదా 10.1 ట్రిలియన్ డాలర్లు …భారతీయ కరెన్సీ ప్రకారం 808 లక్షల కోట్ల రూపాయల సందప ఆవిరైంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరోప్‌లో ఎనర్జీ సంక్షోభం తలెత్తింది. దీంతో పాటు తీవ్రమైన ద్రవ్యోల్బణం తలెత్తిందని నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హెడ్ రీసెర్చి లియామ్ బెయిలీ చెప్పారు. ద్రవ్యోల్బణం ఫలితంగా 2022లో ప్రపంచ చరిత్రలోఎన్నడూ లేని విధంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు విపరీతంగా పెంచేశాయి. అయితే అదే సమయంలో పది మందిలో నలుగురు ఆల్ర్టా రిచ్‌ల సంపద కూడా గత ఏడాది పెరిగింది. మొత్తానికి పరిస్థితులు మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయని నివేదికలో వివరించింది. ఎక్స్చేంజి రేట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపించిందని నైట్ ఫ్రాంక్ నివేదికను తయారు చేసిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫ్లోరా హార్లే చెప్పారు.
మొత్తానికి గత ఏడాది అమెరికా డాలర్‌కు తిరుగులేకుండా పోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని బెయిలీ అన్నారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్ సెంటిమెంట్‌లు మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లు పుంజుకొనే అవకాశాలున్నాయని, 69 శాతం సంపన్న ఇన్వెస్టర్లు మాత్రం ఈ ఏడాది తమ ఫోర్టుపోలియో ద్వారా కోల్పోయిన సంపదను తిరిగి సంపాదించుకోవచ్చునని దృడంగా నమ్ముతున్నారు.
స్టాక్ మార్కెట్లు నష్టపోతే దాని ప్రభావం సంపన్నులపై తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే వారు నడుపుతున్న కంపెనీల్లో మెజారిటి వాటాలు వారి చేతిలోనే ఉంటాయి. కాబట్టి మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయితే వారి వద్ద ఉన్న షేర్ల విలువ కూడా పడిపోతుంది. వారి సంపద కూడా తగ్గిపోతుందని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో వివరించింది.