China: ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ముప్పు పోయిందనుకుంటున్న నేపథ్యంలో చైనాలో మరోసారి కరోనా విజృభిస్తోంది. కొత్త వేరియంట్ తో చైనాలో గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ నెల చివరికి వారంలో 65 మిలియన్ల( 6.5 కోట్లు) కేసులు రికార్డు అవుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబధించి ఇంటర్నేషనల్ మీడియాల్లో చైనా లో కరోనా కేసులపై వార్తలు వెలువడుతున్నాయి.
XBB వేరియంట్ తో(China)
ఏప్రిల్ నెల నుంచి చైనాలో కరోనా కొత్త వేరియంట్ XBB తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇది మే చివరి నాటికి వారంలో 4 కోట్ల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య 6.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. చైనాలో ఇప్పటికే పలు రకాలు వేరియంట్లు బయటపడ్డాయి. అయితే, వాటి వల్ల ఇంత స్థాయిలో కేసులు నమోదు అవ్వలేదు. కానీ, XBB వేరియంట్ వ్యాప్థి ప్రబలుతోందని చైనా వైద్యులు చెబుతున్నారు.
మరో 4 కొత్త టీకాలకు అనుమతులు(China)
ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ లు అభివృద్ధి చేసేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్త వేరియంట్ కు రోగనిరోధక శక్తిని తట్టుకునే సామర్థ్యం ఉండటంతో కేసులు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కేసులను నిరోధించే వ్యాక్సిన్ ల నిల్వను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా, వీలైనంత త్వరంలో మరో 4 కొత్త టీకాలకు అనుమతులు మంజూరు చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చైనాకు చెందని ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ తెలిపారు.
వృద్ధులపై ప్రభావం
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు చైనీస్ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కొత్త వేరియంట్ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతోందని.. ఆ వయసు వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. 2022, డిసెంబరులో చైనాలో జీరో కొవిడ్ పాలసీని ఎత్తేశారు. అయినా అనూహ్యంగా కేసులు నమోదు అవ్వడం కాకుండా, దాదాపు 85 శాతం మంది జనాభా అనారోగ్యానికి గురైనట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.