Site icon Prime9

Canada New Visa Rules: స్టూడెంట్ వీసాలపై కెనడా సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా మార్చిన రూల్స్ ఏంటంటే?

Canada Revises Visa Rules: కెనడా వీసా రూల్స్ మార్చింది. గతంలో ఒక్కసారి కెనడా వీసా వస్తే చాలు.. అక్కడ సెటిలైపోవచ్చనే ఫీలింగ్‌లో చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి వీసా అయినా సరే.. ఏ క్షణంలో అయినా రద్దు చేసే అధికారాన్ని కెనడా పార్లమెంట్ అధికారులకు కట్టబెట్టింది. దీంతో, ఇప్పుడు కెనడా వీసా తీసుకున్నా క్షణక్షణం భయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని వీసా తీసుకుని కెనడా ఎందుకు అనుకునేవారి సంఖ్య ఇప్పుడు ఇండియాలో పెరిగిపోతోంది. కేవలం బిజినెస్, వర్క్ పర్మిట్ ఉన్నవారివి తప్ప.. స్టూడెంట్ వీసాల్లో కెనడా ఉక్కుపాదం మోపింది. ఇంతకీ ఏమేమి రూల్స్ మార్చిందో ఒకసారి చూద్దాం..

వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కట్ల పాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వర్క్ వీసాతో పాటు రెసిడెంట్ పర్మిట్లు ఉన్న వారిపై కూడా ప్రభావం పడొచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలతో కెనడా సరిహద్దుల వద్ద అధికారులు అనేక విచక్షణాధికారాలు దఖలు పడ్డాయి. ఫలితంగా, విదేశీ వర్కర్లు, విద్యార్థుల వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వం అధికారులకు ఇచ్చింది

కెనడా తన వలస నిబంధనలలో గణనీయమైన మార్పులను అమలు చేసింది. ఇది వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. తాజాగా తీసుకున్న ఈ సవరణలతో ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ నిబంధనలు వంటివి జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఈ నిబంధనల ప్రకారం.. సరిహద్దు అధికారులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్, టెంపరరీ రెసిడెంట్ వీసాలు వంటి తాత్కాలిక నివాస పత్రాలను రద్దు చేసే అధికారం ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలు భారతదేశం నుండి వచ్చే వారితో సహా అంతర్జాతీయ విద్యార్థులు, కార్మికులు, తాత్కాలిక నివాసి సందర్శకులకు ఇబ్బందులను సృష్టిస్తాయి.

హైయ్యర్ ఎడ్యుకేషన్‌ కోసం కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారింది. ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారమే, ఇప్పుడు కెనడాలో దాదాపు 4లక్షల27 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. సవరించిన నిబంధనలు కెనడియన్ ఇమ్మిగ్రేషన్ – సరిహద్దు అధికారులకు మెరుగైన అధికారాలను అందిస్తాయి. నిర్దిష్ట పరిస్థితులలో ఈటీఏలు, టీఆర్వీలు, పని అనుమతులు, అధ్యయన అనుమతులను రద్దు చేయడానికి వారికి వీలు కల్పిస్తాయి.

వీసా కోసం రాంగ్ ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వటం కానీ, క్రిమినల్ రికార్డ్ ఉన్నారని తేలినా, వీసా ముగిసిన తర్వాత కెనడాను విడిచి వెళ్లే అవకాశం లేదని అధికారులు భావించినా చాలు.. వారిని అనర్హులుగా ఏ క్షణమైనా అధికారులు భావించి వీసా రద్దు చేయచ్చు. ఈ వీసా నిబంధనల మార్పు కారణంగా, దాదాపు 7,000 అదనపు తాత్కాలిక నివాస వీసాలు, పని అనుమతులు, అధ్యయన అనుమతులు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

విదేశీ పౌరులు, ముఖ్యంగా భారతీయుల అనుమతులు రద్దు చేయబడితే, వారు కెనడాలోని ప్రవేశ నౌకాశ్రయాల ద్వారా అక్కడికి ప్రవేశించకుండా నిరోధించడం లేదా దేశం విడిచి వెళ్లవలసి రావడం వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కెనడాలో అమల్లోకి వచ్చిన కొత్త వీసా నిబంధనలు అక్కడ అధికారులకు అసాధారణ విచక్షణాధికారాలు కట్టబెట్టాయి. దీంతో, భారతీయ విద్యార్థులకు ఇక్కట్లు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా నిబంధనల ప్రకారం, కెనడా బోర్డర్ అధికారులకు విదేశీయుల వీసాలను రెసిడెంట్ డాక్యుమెంట్లను తిరస్కరించే అవకాశం ఉంది. విదేశీయులు కెనడాను వదిలి తిరిగి వెళ్లరన్న అధికారులకు బలంగా అనిపిస్తే వారి వీసా, ఇతర డాక్యుమెంట్లను తిరస్కరించ వచ్చు. అయితే, విదేశీయుల వర్క్ పర్మిట్లు, విద్యార్థుల వీసాలు రద్దు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతుల్ని కూడా రద్దు చేసే అధికారం అక్కడి అధికారులకు ప్రభుత్వం ఇచ్చింది. ఒకవేళ అనుమతులు రద్దు చేసిన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచే వెనక్కు పంపించే అవకాశం ఉంది. కాగా, కెనడాలో ఉంటున్న విదేశీయులకు ఓ తేదీలోగా వెనక్కి వెళ్లాలని నోటీసులు జారీ చేయనున్నారు.

కొత్త నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో వేల మంది విదేశీయులపై ప్రభావం పడుతుందన్న భావన ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో కెనడా కూడా మొదటి వరుసలో ఉంది. భారతీయ విద్యార్థులు, వర్కర్లు అనేక మంది అక్కడ ఉంటున్నారు. . ఇక భారతీయ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో కెనడాకు వెళుతున్నారు. 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. గత రెండు మూడేళ్లుగా కెనడా – భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ తరువాత వరుస పరిణామాలు జరిగాయి. దీంతో 90 రోజుల క్రితమే కెనడా ఎస్‌డీఎస్ వీసా ప్రోగ్రామ్‌ను క్యాన్సిల్ చేసింది కూడా. ఇప్పుడు కెనడా వెళ్లే భారతీయులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఇండియా కూడా అడ్వైజరీ నోటీసులు జారీ చేస్తోంది.

Exit mobile version
Skip to toolbar