Nigeria: నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా, 70 మందికి పైగా తప్పిపోయారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యాపారులతో సహా 100 మందికి పైగా ఉన్నారు.
నైజీరియాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన బెన్యూ నదిపై బోల్తా పడింది. 14 మందిని రక్షించామని, 18 మంది మృతదేహాలను వెలికితీశామని, 70 మందికి పైగా గల్లంతయ్యారని నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి లాడాన్ అయుబా తెలిపారు. నైజీరియాలో ఘోరమైన పడవ ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయి. చాలా వరకు ఓవర్‌లోడింగ్ కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, ఆ ప్రాంతాల్లో మంచి రహదారులు లేకపోవడంతో ఎక్కువమంది పడవలనే ఆశ్రయిస్తారు.
తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్ ప్రమాదాన్ని విషాదంగా అభివర్ణించారు. పడవ ప్రయాణీకులకు లైఫ్ జాకెట్లను ఉపయోగించాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలోని నీరు సంపదకు నిజమైన వనరుగా ఉండాలి మరణానికి కాదు అని తన కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తారాబా పోలీసు ప్రతినిధి ఉస్మాన్ అబ్దుల్లాహి తెలిపారు.