Site icon Prime9

Mehul Choksi: మెహుల్ ఛోక్సీని భారత్ కు అప్పగించడం సాధ్యం కాదన్న ఆంటిగ్వా కోర్టు

Mehul Choksi

Mehul Choksi

 Mehul Choksi: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం లో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీకి ఆంటిగ్వా కోర్టులో ఊరట లభించింది. అతడిని దేశం నుంచి పంపించడానికి వీల్లేదంటూ ఛోక్సీకి అనుకూలంగా అక్కడి హైకోర్టు ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. 2021 మే నెలలో ఛోక్సీ ఆంటిగ్వా నుంచి అదృశ్యమై పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆంటిగ్వా నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు తనను కిడ్నాప్‌ చేశారని ఆరోపించాడు చోక్సి. డొమినికాలో తనను చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నాడు. దీనిపై ఆయన ఆంటిగ్వా కోర్టులో సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఆరోపణలపై ఆంటిగ్వా అటార్నీ జనరల్‌, పోలీసు చీఫ్‌ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరాడు.

చోక్సీ ఆరోపణలు సబబే అన్న కోర్టు..( Mehul Choksi)

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అక్కడి హైకోర్టు.. ఛోక్సీకి అనుకూలంగా తీర్పు వెలువరించినట్లు మీడియా వార్తలు వచ్చాయి. చోక్సీ చేస్తున్న ఆరోపణలు వాదనలకు అర్హమైనవేనని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తయి హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకు ఛోక్సీని ఆంటిగ్వా నుంచి పంపించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఛోక్సీ తనకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం వీలు కల్పించినట్లు స్థానికి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తాజా కోర్టు నిర్ణయంతో చోక్సీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తున్నాయి.

ఇదిలా ఉండగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి బ్యాంకుకు సుమారు 13 వేల 500 కోట్లు మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్కామ్‌ వెలుగులోకి రాకముందే చోక్సి ఆంటిగ్వా పారిపోయాడు. అక్కడి పౌరసత్వాన్ని తీసుకొని నివసిస్తున్నాడు. అయితే 2021 మే నెలలో ఆంటిగ్వా నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన చోక్సి .. ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కాడు. ఛోక్సీని బలవంతంగా కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని అతడి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఆ సమయంలో ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు.

కిడ్నాప్‌ కేసులో విచారణ జరిపిన డొమినికా.. అనారోగ్య కారణాల రీత్యా అతడికి బెయిల్‌ మంజూరు చేస్తూ తిరిగి ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు, ఛోక్సీపై జారీ చేసిన రెడ్‌ కార్నర్ నోటీసును ఇటీవల ఇంటర్‌పోల్‌ ఎత్తేసిన విషయం తెలిసిందే.

Exit mobile version