Cluster Bombs: రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఈ విధ్వంసం ఆగలేదు. యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కసితో ఉక్రెయిన్, ఆయుధాల కోసం అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ప్రత్యక్షంగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య అయితే పరోక్షంగా మాత్రం రష్యా- అమెరికా దేశాల మధ్య జరుగుతుందని చెప్పవచ్చు. కారణం ఏదైనా రష్యా-ఉక్రెయిన్ యుద్ధరంగంలో నిషేధించిన మరియు వివాదాస్పద ఆయుధాలను ప్రవేశపెట్టబోతోంది అమెరికా. అత్యంత ప్రమాదకరమైనవని 100కుపైగా ప్రపంచ దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు అందించాలని అమెరికా నిర్ణయించింది. కాగా ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంఘాల వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్లస్టర్ బాంబులతో పౌర సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుందని.. విచక్షణారహితంగా జరిగే ఈ దాడులతో చాలామంది మరణించే ప్రమాదం ఉందని.. యుద్ధంలోనే కాదు.. యుద్ధానంతరం పేలే ఈ బాంబులతో ఎక్కువ నష్టమే జరుగుతుందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.
అసలు క్లస్టర్ ఆయుధాలనేవి గాల్లో విచ్చుకొని..చిన్నచిన్న బాంబులుగా విడిపోయి ఒకే సమయంలో అనేక లక్ష్యాలను ఛేదిస్తాయి. ఫిరంగుల ద్వారా 24-32 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై వీటిని ప్రయోగించవచ్చు. మామూలు బాంబుల కంటే వీటి విధ్వంస ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. వీటిలోని మరో ప్రధాన సమస్య విచ్చుకుపోయిన బాంబు ముక్కల్లో కొన్ని అప్పటికప్పుడు పేలవు. కొద్దికాలం తర్వాత పేలే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సందర్భాలే వీటిలో ఎక్కువ. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటి ముప్పు ఉంటుంది. అందుకే.. 2008లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 120కిపైగా దేశాలు ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధించాయి. అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌లు మాత్రం ఆ ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
20 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన క్లస్టర్లు(Cluster Bombs)
అమెరికా చివరిసారిగా వీటిని 2003లో ఇరాక్ యుద్ధంలో ఉపయోగించింది. ఆ తర్వాత నుంచి ఈ క్లస్టర్ బాంబుల వినియోగాన్ని ఆపేసింది. అప్పటి నుంచి అమెరికాలో భారీస్థాయిలో ఈ క్లస్టర్ ఆయుధాలు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 30 లక్షల దాకా ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ ఇప్పుడు ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం ద్వారా అమెరికా ఈ బాంబులను వదిలించుకోబోతోందని తెలుస్తోంది.
రష్యాపై దాడిని తిప్పికొట్టాలంటే ఉక్రెయిన్‌కు ఈ క్లస్టర్‌బాంబులు ఇవ్వటమే కరెక్ట్ అని అమెరికా భావిస్తోంది. ‘రష్యా ఇప్పటికే క్లస్టర్ బాంబులను ఈ యుద్ధంలో ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎక్కువ నష్టం జరగటానికి ఈ బాంబులే ముఖ్య కారణమని చెప్పవచ్చు. రష్యాను యుద్ధరంగంలో కట్టడి చెయ్యాలంటే ఉక్రెయిన్‌కూ ఈ క్లస్టర్ ఆయుధాలను ఇవ్వటంలో తప్పులేదని.. పైగా ఇప్పుడు సరఫరా చేసే ఆయుధాల్లో విఫలమయ్యేవి చాలా తక్కువశాతం’ అని అమెరికా అధికారి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.