Accenture: భారీగా ఉద్యోగాల కోత పెట్టిన యాక్సెంచర్

ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధి రేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది యాక్సెంచర్. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8 నుంచి 10 శాతంగా అంచనా వేసింది.

Accenture: ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలను ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్‌, మెటా, ట్విటర్‌, ఎరిక్సన్‌ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. తాజాగా ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ కూడా అదే బాటలో నడుస్తోంది. యాక్సెంచర్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటన చేసింది. సుమారు 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

స్వల్ప ఆదాయ అంచనా(Accenture)

ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధి రేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది యాక్సెంచర్. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8 నుంచి 10 శాతంగా అంచనా వేసింది. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ. ఇప్పటికే పలు కంపెనీలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. చాలా వరకు అమెరికన్ ఐటీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. గతంలో కూడా పలు సంస్థలు లేఆఫ్‌లు విధించాయి. ఆ సమయంలో భారత్‌లోని ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో యాక్సెంచర్‌ కోతల నిర్ణయంతో భారత్‌లో ఎంత మందిపై ప్రభావం ఉంటుందనేది చూడాలి.

రాబోయే 18 నెలల్లో(Accenture)

2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది. అంతేకాదు గతంలో 11.20 నుంచి11. 52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10. 84 నుంచి11. 06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.