Myanmar: సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం చోటు చేసుకొంది. ఓ పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పాఠశాలలో రెబల్స్ నక్కి దాడులు చేస్తుండటంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని మయన్మార్ సైన్యం చెబుతోంది. మధ్య సాగింగ్ ప్రాంతంలోని లెట్‌యట్‌కోనే అనే గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ గ్రామంలోని బౌద్ధమఠాన్ని ఆధారంగా చేసుకొని పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ గ్రూపునకు చెందిన రెబల్స్ ఆయుధ రవాణా చేస్తున్నారని సైన్యం ఆరోపించింది. ఇక్కడ తనిఖీలకు వచ్చిన సైనిక హెలికాప్టర్ల పై దాడి చేయడంతో సైన్యం ప్రతిదాడి చేసింది. రెబల్స్ ప్రజలను మానవ కవచాలుగా వాడుకొంటున్నారని సైన్యం ఆరోపిస్తోంది. ఈ దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని వెల్లడించింది.
గ్రామంలోని ఓ బౌద్ధమఠంలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కొందరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతదేహాలను సైన్యం అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని ఓ టౌన్‌షిప్‌నకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్పుల కారణంగా తూట్లు పడిన పాఠశాల భవనం చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి. మయన్మార్ సైన్యం ఉద్దేశపూర్వకంగానే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటోందని ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ అనే సంస్థ ఆరోపించింది.