Boats Missing: బతుకు దెరువు కోసం వేరే ప్రాంతాలకు పయనమైన వారిని అనుకోని పడవ ప్రమాదం ముంచేసింది. బతుకు జీవుడా అని బయలుదేరిన వందల మంది జలదిగ్భందంలో చిక్కుకుని కానరాకుండా పోయారు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలో చోటుచేసుకుంది. సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు బయల్దేరిన మూడు పడవలు సముద్రంలో కనబడకుండా పోయాయి. స్పెయిన్‌కు చెందిన ఈ మూడు పడవల్లో దాదాపు 300మంది ప్రయాణిస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న ఈ 3 పడవల ఆచూకీ గల్లంతైయ్యిందని వలస సహాయక బృందం వాకింగ్ బోర్డర్స్ ఆదివారం వెల్లడించింది.
దీనితో స్పెయిన్ అధికారులు కానరీ దీవుల సమీపంలో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదృశ్యమైన పడవల్లో 200 మందికిపైగా వలసదారులతో ఒక పడవ, 100 మందికిపైగా వలదారులతో మరో రెండు పడవలు దాదాపు 15 రోజుల క్రితం జూన్ 27న కానరీ దీవులకు బయల్దేరాయి. ఈ మూడు పడవలు సముద్రంలో అదృశ్యం కావడంతో వలసదారుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలసదారుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇప్పటి వరకూ దాదాపు 86 మందిని రక్షించారు. ఈ మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వలసదారుల తాకిడి తీవ్రంగా పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. నిజానికి పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ దీవుల ప్రయాణ మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా నివేదికలు చెబుతున్నాయి.
ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, హింస, రాజకీయ అస్థిరత, వాతావరణ మార్పుల ఇంకా అనేక కారణాలవల్ల వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టిమరీ దేశాన్ని దాటేందుకు సాహిస్తున్నారు. యూఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డేటా ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 559 మంది వరకూ గల్లంతయ్యారు. గతంలో ఈ మార్గంలో దాదాపు ఏడు వలసదారుల పడవలు మునిగిపోయినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.