Burkina Faso: బుర్కినా ఫాసోలో మిలిటరీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు గ్రామాల్లో సుమారు 223 మందని దారుణంగా చంపారని మానవ హక్కు గ్రూపు తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. ఈ సామూహిక హత్యలు ఫిబ్రవరి 25 నోన్‌డిన్, సోరో గ్రామాల్లో జరిగాయని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపు సమాచారం ప్రకారం ఈ రెండు గ్రామాలకు చెందిన పౌరులు స్థానిక సాయుధ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై వీరిని చంపేశారని నివేదికలో వివరించింది.
నోన్‌డిన్ గ్రామంలో 44 మందిని, వారిలో 20 మంది పసిపిల్లలున్నారు.. అక్కడికి సమీపంలోని సోరో గ్రామంలో 179 మంది.. వారిలో 36 మంది చిన్నారులు ఉన్నారని మానవ హక్కుల గ్రూపు పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో డజన్ల కొద్ది ప్రత్యక్ష సాక్షులను మానవ హక్కులు గ్రూపు విచారించింది. ఈ దారుణాలకు సంబంధించి వీడియోలు, ఫోటోలు, చనిపోయిన వారి పేర్లను కూడా మానవ హక్కుల గ్రూపు సంపాదించింది. అయితే ఈ మాస్ కిల్లింగ్‌లో చనిపోయిన వారిని ఎనిమిది అతి పెద్ద సామాహిక సమాధారుల్లో పూడ్చి పెట్టారని జియోలోకెటెడ్ సాటిలైట్ ఇమెజెరీ ద్వారా కనుగొన్నారు.
బలవుతున్న అమాయకులు..(Burkina Faso)
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 24, 25 తేదీల్లో సాయుధ దళాలు దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ గ్రూపులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. వాటిలో ఆర్మీ బరాక్స్ బేసెస్‌లతో పాటు సివిలియన్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ అంటే ప్రార్థన స్థలాలపై దాడులు చేసి పౌరులతో పాటు సైనికులను పెద్ద ఎత్తున దారుణంగా కాల్చి చంపింది. ఈ సంఘటన తర్వాత రక్షణమంత్రి మహమూద్ సానా స్పందించారు. గ్రామస్తుల సహకారంతోనే సైనికులను చంపారని ఆరోపించారు. అయితే నోన్‌డిన్, సోరో గ్రామాల్లో జరిగిన సామూహిక హత్యల గురించి మాత్రం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక పౌరుల విషయానికి వస్తే వీరి బతుకులు అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యాయి. ఒక పక్క అల్ ఖైదీతో లింక్ ఉన్న ఐసిస్ గ్రూపు, మరోపక్క భద్రతా దళాలు వీరి మధ్య అమాయ ప్రజలు బలవుతున్నారు.
ప్రస్తుతం మిలిటరీకి, సాయుధ దళాల పోరులో అమాయక ప్రజలు నలిగిపోతున్నారు. ప్రస్తుతం దేశంలోని సగ భాగం మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మిగిలిన సగ భాగం సాయుధ మిలిటెంట్ల చేతిలో ఉంది. బుర్కినా ఫాసోలో పెచ్చరిల్లున్న హింసలో సుమారు 20వేల మంది పైనే మృతి చెందారు. సుమారు రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పశ్చిమ ఆఫ్రికా దేశానికి చెందిన బుర్కినా ఫాసోలో ప్రభుత్వాన్ని మిలిటరీ నడుపుతోంది. కెప్టెన్ ఇబ్రహీం ట్రారోర్ తిరుగుబాటు ద్వారా సెప్టెంబర్ 2022లో అధికారం చేపట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రెసిడెంట్ రోచ్ మార్క్ కబోర్ ప్రభుత్వాన్ని సాయుధ దళాలు కూల్చివేశాయి.