Vegetables: కొన్ని ఆహారపదార్థాల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తింటే వాటిలో ఉండే పోషకాలు, మినరల్స్, విటమిన్లు పూర్తిగా అందుతాయని కొందరు.. అలా కాదు వండితేనే మేలు అని కొంతమంది చెబుతుంటారు. వాటిలో నిజమెంతో తెలియదు. కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఈ కూరగాయలను తినడానికి ముందు ఆవిరి లేదా ఉడికించి మాత్రమే తినాలంటున్నారు. కాబట్టి ఏవి వండి తినాలి? ఏవి పచ్చివి తినాలో చూద్దాం..
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్ ఫైటోకెమికల్ లైకోపైన్ ఉంటుంది. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా శోషించుకోవాలంటే టమాటాలను ఉడికించి తినాలి.
పుట్టగొడుగుల్లో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్ ఉంటాయి. వాటితో పాటే తక్కువ పరిమాణంలో టాక్సిన్స్ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్‌ను హరించి పాలీశాఖరైడ్స్ శరీరానికి వంటబట్టాలంటే పుట్టగొడుగుల్ని ఉడికించే మాత్రమే తినాలి.
క్యాన్సర్‌తో పోరాడే ఫెర్యూలిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగ్‌స ని ఉడికించి తినాలంటున్నారు.
పాలకూరలో ఫోలేట్ ఉంటుంది. దీన్ని ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. పాలకూరను ఆవిరి మీద ఉడికించి తినాలి. ఇది ఫోలెట్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో మెదడుకు, గుండెకు అవసరమైన ‘ఫోలేట్’ ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఫోలేట్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బీట్‌రూట్‌ను ఉడికిస్తే ఫోలేట్ నశిస్తుంది. కాబట్టి బీట్‌రూట్‌ను సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకోవటమే మేలు.
ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటోన్యూట్రియంట్ ఉంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా చూస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ పచ్చి ఉల్లిపాయలు కూడా తింటూ ఉండాలి.
శరీరానికి విటమిన్ సి ఎక్కువగా అందాలంటే పచ్చి బెల్ పెప్పర్ ని తీసుకోవాలి. ఇది హృద్రోగాలు, కంటి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి బెల్ పెప్పర్‌ను పచ్చిగా లేదా కొద్దిసేపు సాట్ చేయాలి గానీ మెత్తగా ఉడికించకూడదు.