Ganji Benefits: ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు వచ్చి అందరూ వాటిలోనే అన్నం వండుతున్నారు. కానీ పాత రోజుల్లో బియ్యాన్ని ఉడికించి గంజి వడకట్టేవారు. ఆ వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే రానురాను గంజిని పక్కన పెట్టేశారు. ఎప్పుడైనా అన్నం వండి గంజి తీసినా పారబోస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల కావాల్సిన పోషకాలను పారబోయడమే అవుతుంది. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గంజిలో ఇమిడి ఉన్నాయి. వాటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
గంజి నీటిలో శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ అమైనో యాసిడ్స్ గ్లూకోజ్ కంటే త్వరగా శక్తిని ఇస్తాయి. గంజిని తాగడం వల్ల కండరాలకు మేలు కలుగుతుంది. ఒక గ్లాస్ గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగడం వల్ల డయేరియా సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా ఇన్ ఫెన్షన్లు దరి చేరవు.
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయటికి వెళ్లి ఇంటికి రాగానే దాహంతో కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. నిజానికి కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరుతుందేమే గానీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం కంటే ఒక గ్లాస్ గంజి మించింది లేదంటున్నారు నిపుణులు.
గంజి నీటిలో Vitamin B లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం దరిచేరనివ్వదు. ముఖ్యంగా పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిది. పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉపయోగపడుతుంది. గంజిలో తక్కువ కేలరీలు ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకు కారణం గంజిలో ఉండే పీచు పదార్థాలే. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎముకలు గట్టి పడాలంటే రోజూ గ్లాసు గంజి తాగండి. ముఖ్యంగా మహిళలు రెగ్యులర్ గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బియ్యంతో తీసిన గంజి మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలు, చిరుధాన్యాల ద్వారా తయారుచేసిన జావ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
బరువు తగ్గాలనుకునేవాళ్లకు గంజి మంచి ప్రత్యామ్నాయం . కేలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. ఫైబర్ కంటెంట్ అధికం కాబట్టి తొందరగా ఆకలి వేయదు. అందుకే ప్రతిరోజూ గంజి గానీ, జావ గానీ తయారుచేసుకుని ఉదయం తాగితే మంచి పోషకాహారంగా, బరువు తగ్గించేందుకు పనిచేస్తుంది.
గంజి తాగడం వల్ల కడుపులో మంట, అసిడిటీని తగ్గించుకోవచ్చు. రాత్రి వండిన అన్నాన్ని వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఉదయం త్వరగా ఈ అన్నాన్ని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిని తినడం వల్ల వికారాలు, తాపం, దప్పిక, మూత్ర దోషాలు, అధిక వేడి తగ్గుతాయి.
గంజిని చైనాలో రైస్ సూప్ గా పిలుస్తారు. దాదాపు ఆసియా దేశాల వారందరూ గంజి ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాబట్టి గంజిని తరచూ తాగుతుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.