Diabetes Foot Care: ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 415 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో అన్ని జాతులకు చెందిన పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది చాలా మంది తరచుగా విస్మరించే లేదా తెలియని ముఖ్యమైన విషయాలలో ఒకటి. అసాధారణమైన అధిక రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయి. కానీ అవి మీ పాదాలకు కూడా సమస్యలను కలిగిస్తాయని, దీనివలన పాదాలు మొద్దుబారి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
డయాబెటిక్‌గా ఉండటం వల్ల మీ పాదాలకు రక్త ప్రవాహం తగ్గిపోయి నరాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. మీరు నొప్పిని పసిగట్టలేరు కాబట్టి, చిన్న గాయం కూడా చాలా తీవ్రంగా మారుతుంది. దీనివలన కాళ్లు మరియు పాదాలలో నొప్పి, మంట, జలదరింపు మరియు తిమ్మిరి వుంటుంది. చర్మం పొడిబారడం, పగుళ్లు, మడమలకు నష్టం, పొలుసులు, కాలి మధ్య విరిగిన చర్మం, పొట్టు వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిని అశ్రద్ద చేస్తే గాంగ్రీన్ కు దారితీస్తుంది. ఇటువంటి సమస్యలు నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.
మధుమేహ రోగులు పాదాల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద చూపాలి. మందులను క్రమం తప్పకుండా మరియు సమయానికి తీసుకోవాలి. పాదాలపై ఏదైనా గాయం, కోతలు ఏర్పడినపుడు వైద్యుడిని సంప్రదించాలి. స్నానం చేసిన తర్వాత పాదాలను ఆరబెట్టి క్రీమ్ లేదా జెల్లీని రాయాలి. కాలి వేళ్ల మధ్య తేమలేకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను గోరువెచ్చని నీటిలో మాత్రమే కడగాలి. స్మోకింగ్ కు దూరంగా వుండాలి. చెప్పులు లేకుండా నడవడం, బురదలో సంచరించడం చేయకూడదు. శుభ్రమైన మరియు పొడి సాక్స్ ధరించాలి. షూ ఎంపిక చేసుకునేటపుడు సరిగా చూసుకోవాలి. పాదాలను ఎల్లప్పుడూ వెచ్చగా మరియు పొడిగా ఉంచాలి.