Covid Cases: దేశంలో మళ్లీ కొవిడ్ టెన్షన్.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.

Covid Cases: రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే 40 శాతం పాజిటివ్‌ కేసులు పెరగడం కరోనా వ్యాప్తికి అద్దం పడుతోంది. దీంతో దేశంలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలొ కొవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 వేలు దాటింది.

 

ఒక్కరోజే 14 మరణాలు(Covid Cases)

కాగా, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 3016 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. బుధవారం దేశ వ్యాప్తంగా మొత్తం 1,10,522 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 3 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి.

మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151 గా ఉన్నాయి. కానీ, ఒక్కరోజులోనే ఆ సంఖ్య వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్‌ కారణంగా బుధవారం ఒక్కరోజు 14 మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు కొవిడ్ తో మృతి చెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862 కి చేరుకుంది.

 

మళ్లీ 6 నెలల తర్వాత

మరో వైపు దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 13,509 గా ఉంది. ఇందులో రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. ఇంకో వైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమై అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3375 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. మళ్లీ 6 నెలల తర్వాత.. కేసుల సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది.