Covid 19: కోవిడ్ 19 చాలామందికి తేలికగా, త్వరగా నయం అయింది. అయితే కొంత మందిలో మాత్రం అది చాలా కాలం ఇబ్బంది పెట్టింది. వారాలు, నెలలు కూడా కొవిడ్ తో ఇబ్బంది పడిన బాధితులు ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటో అనేది చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు. అదే విధంగా దీర్ఘ కాలంగా కరోనాతో బాధపడిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనిపై కూడా పెద్ద ఎత్తున అధ్యయానాలు కొనసాగుతున్నాయి.
ఆరోగ్యంలో అనేక మార్పులు
ఈ క్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ జర్నల్‌లో ఓ కథనం పబ్లిష్ అయింది. అందులో దీర్ఘ కాల కొవిడ్ బాధితులు శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా కరోనా సోగి ఎక్కువ కాలం ఇబ్బంది పడిన వారి ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తున్నాయని తేలింది. అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కొవిడ్‌తో బాధపడిన 3,750 మంది రోగులపై యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన డాక్టర్లు పరిశోధనలు చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారి ఆరోగ్యంలో ఏలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ బృందం పరిశోధనలు చేసింది.
క్యాన్సర్ నాల్గో స్థాయిలో(Covid 19)
దీర్ఘకాలిక కొవిడ్ బాధితుల నుంచి ముఖ్యంగా అలసట, నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం ఎలా ఉందనే.. అంశాలపై ప్రశ్నలకు ఓ యాప్ ద్వారా సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. దాని తీవ్రత ఎంతంటే.. ఒక వ్యక్తికి ఊపిరితిత్తుల క్యాన్సర్ నాల్గో స్థాయిలో ఉన్నప్పుడు ఆ బాధితుడు ఏ మేరకు అలసటకు గురవుతాడో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. ‘బాధితుల జీవితాలపై దీర్ఘకాలిక కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని అధ్యయనంలో తేలింది.
దీని ప్రభావంతో రోజువారీ పనులను సజావుగా చేసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు’ అని స్టడీకి నాయకత్వం వహించిన డా. హెన్రీ గుడ్‌ఫెలో వెల్లడించారు. ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసిన వారిలో 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు 90 శాతం మంది ఉన్నారు. కొవిడ్ సోకిన తర్వాత గతంలో మాదిరి పని చేయలేకపోతున్నట్టు దాదాపు 51 శాతం మంది స్టడీలో పేర్కొన్నారు. 20 శాతం మంది పూర్తిగా పని చేయలేక పోతున్నామని చెప్పారు. మరోవైపు తమ వివరాలు పేర్కొన్న కొవిడ్ బాధితుల్లో 71 శాతం మంది మహిళలే ఉన్నారు.