Cancer Fighting Foods: మారిన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం దగ్గర.. ఒక్కోసారి తెలిసీ తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల చేస్తుంటాం. దాని ఫలితమే పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో మహమ్మారి క్యాన్సర్ కూడా ఒకటి. అయితే క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. కానీ చాలామందికి చివరి దశలో క్యాన్సర్ బయటపడి జీవితాన్నే కోల్పోతున్నారని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. అయితే సరైన లైఫ్ స్టయిల్ ని పాటిస్తూ.. కొన్ని రకాల ఫుడ్స్ కూడా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహార పదార్ధాలేంటో చూడండి.
నారింజలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్, బరువును కూడా నారింజ తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచేలా చేస్తుంది.
పెద్దపేగు, ప్రొస్టేట్, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో బ్రకోలి సాయపడుతుంది. బ్రకోలి ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుంది.
క్యాన్సర్ కణాలు పెరగకుండా(Cancer Fighting Foods)
గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అన్నవాహిక, ఊపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ఇందులోని పాలీఫినాల్స్ కొత్త కణాలను కూడా భర్తీ చేస్తాయి.
ద్రాక్ష ఎలాజిక్ యాసిడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. పర్యావరణంలోని విష పదార్థాలు శ్వాస వ్యవస్థకు హాని చేయకుండా ఎలాజిక్ యాసిడ్ రక్షణ కల్పిస్తుంది.
అల్లం క్యాన్సర్ కణాలను తామంత తాముగా నశించేటట్టు చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా అల్లం నిరోధిస్తుంది. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అల్లం అడ్డుకుంటుంది.
వెల్లుల్లిలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను వెల్లుల్లి నిరోధిస్తుంది.
ప్రతి రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమే. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాలేయ క్యాన్సర్ నిరోధించడంలో(Cancer Fighting Foods)
సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వివిధ విటమిన్లు, ప్రొటీన్లు, సెలీనియం సాల్మన్ చేపల నుంచి లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి. గుండెపోటును అడ్డుకోవడంలో సాల్మన్ చేపలు మంచి పాత్ర పోషిస్తాయి.
బీన్స్, చిక్కుడు మొదలైనవి రొమ్ము క్యాన్సర్‌ను బాగా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను కూడా ఇవి ఉత్పత్తి చేస్తాయి. రక్తంలోని షుగర్ స్థాయిలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి. దానిమ్మ రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పాలీఫినాల్‌ను కలిగి ఉంటుంది. ఈ పాలీఫినాల్ క్యాన్సర్ పెరగకుండా చూస్తుంది.
పసుపు క్యాన్సర్‌ను సమర్థంగా నిరోధిస్తుంది. రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్ కణాలను ఇది నిర్వీర్యం చేస్తుంది. క్యాన్సర్ కారక కణాలతో ఇది సమర్థంగా పోరాడుతుంది. క్యాన్సర్‌పై పోరాడటానికి మిరియాలు మంచి సాధనం. వీటిలోని క్యాప్‌సైసిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను కలిగించే కణాలను నిర్మూలిస్తాయి. వీటిని కూరగాయలతో కలిపి తీసుకుంటే మేలు.
క్యాన్సర్‌ను నిరోధించే బయోఫ్లేవనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్‌లు ఇందులో ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడానికి క్యారెట్లు ఎంతగానో తోడ్పడతాయి.
వాటికి దూరంగా..
తక్కువ మోతాదు అయినా సరే ఆల్కహాల్ తీసుకోకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు.
కేక్స్, చిప్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. రొమ్ము క్యాన్సర్‌ను ప్రేరేపించే హెటరో సైక్లిక్ అమైన్లను ఉత్పత్తి చేసే రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి.
ఫ్రైడ్ ఫుడ్ లాంటి శ్యాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు.