Benefits of Ghee: అనేక పోషక విలువలు కలిగిన పదార్థం నెయ్యి. ఆయుర్వేదంలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. కానీ, నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దాన్ని ఆహారంగా తీసుకుంటే బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది ఊబకాయం వస్తుందనే భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి తినడంవల్ల బరువు పెరుగుతారా..? అందుకు శాస్త్రీయ ఆధారాలు ఏవైనా ఉన్నాయా..? అంటే లేవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు. కానీ, అతిగా కాకుండా మితంగా రోజూ నెయ్యి తీసుకోవడంవల్ల బరువు తగ్గవచ్చంటున్నారు. రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్లకు మించకుండా నెయ్యి తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా నెయ్యి కలిపి పరగడపున తాగండి. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్టరాల్‌ని తగ్గిస్తాయి. నెయ్యిలోని విటమిన్లు, మినరల్స్ జీవక్రియల్ని మెరుగుపరుస్తాయి. చాలాసేపు ఆకలి కానివ్వవు. కాబట్టి, ఎక్కువ కెలోరీలు తీసుకుంటామనే టెన్షన్ ఉండదు.
రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా యాక్టివ్ గా, శక్తివంతంగా ఉండవచ్చు. నెయ్యి శక్తిని ఉత్పత్తి చేసే ఒక పవర్‌హౌస్ లాంటిది. అందుకే మహిళలకు గర్భధారణ సమయంలో నెయ్యి తినాలని సూచిస్తారు.
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడం ద్వారా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంలో నిగారింపు, ఆరోగ్యకరమైన చర్మం పొందాలంటే ఆహారంలో రోజూ వేసుకోండి.
శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాక బాధపడే మహిళలు ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
నెయ్యిలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. అది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. తద్వారా దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
నెయ్యి వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుందంటున్నారు నిపుణులు. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది.
నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి తో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి.
గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం.. వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. వారి సమస్య స్థాయిని బట్టి నెయ్యి వినియోగాన్ని తగ్గించడం లేదంటే డాక్టర్ సలహా మేరకు ఉపయోగించడం మంచిది.