Waltair Veerayya : కథా రచయితగా, సినీ దర్శకుడిగా యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు వారందరికీ సుపరిచితులు అని చెప్పాలి. రచయితగా తెలుగు వారిని అలరించిన ఆయన దర్శకుడిగా కూడా ”స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు” సినిమాలు రూపొందించారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై యండమూరి ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ బాబీ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ రోల్ లో చిరు కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలలో నటిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది.
కాగా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పాట సాహిత్యంపై యండమూరి వీరేంద్రనాధ్ అసహనం వ్యక్తం చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్వ్స్ అందించారు. ముఖ్యంగా ఈ పాటలో తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే అనే పదాలపై యండమూరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ పై ఫైర్ అయ్యారు. ఆ పోస్ట్ లో… ” తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే … తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే !.. ఇవి వాల్తేరు వీరయ్య సినిమా పాటలోని పదాలు !.. వ్రాసిన వారు ఎవరో కానీ అసలు అతడెందుకు వ్రాశాడు అతనికి ఏ సంప్రదాయం తెలుసు ? ఏ పురాణకధలు చదివాడు ? తిమిరము అంటే అర్ధం తెలుసా నీకు?.. త్రినేత్రుడు అనగా శివమహాదేవుడు ! ఆయన తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు, లేదా రోగమున్న కన్నుకలవాడు !
ఏ అర్ధం తీసుకున్నా అది శివదూషణే ! .. ఇక ఏ తుఫాను అంచున వశిష్టమహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా ? .. తెలుసా తెలియదా ? ఏమిటీ పిచ్చిరాతలు ? తెలుగు సినీ కవిత్వం వేటూరి మరణంతో మసకబారిన దీపమయ్యింది సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది !” అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మూవీ యూనిట్ ఈ పోస్ట్ పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.