Virupaksha: సుకుమార్ శిశ్యుడు దర్శకుడు కార్తిక్ వర్మ దండు కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. థియేటర్, ఓటీటీలో ‘విరూపాక్ష’మూవీ సూపర్‌హిట్ అందుకున్న సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఆయనకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని కార్తిక్ తెలియజేస్తూ తన ట్విటర్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘‘నా జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ‘విరూపాక్ష’. ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్‌ను నాకు అందించిన నా గురువు సుకుమార్, హీరో సాయిధరమ్ తేజ్, అలాగే నిర్మాత బీవీఎస్‌ఎస్ ప్రసాద్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని ఆయన ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక కారు విషయానికి వస్తే బెంజ్ సీ క్లాస్ మోడల్‌కు చెందిన ఈ కారు ధర సుమారు రూ.66 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం.
రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ చేసిన తొలి సినిమా ఇదే. ఇందులో ఆయన సూర్య అనే యువకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు జంటగా మళయాల బ్యూటీ సంయుక్త కీలక పాత్రలో కనిపించారు. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల ఓటీటీలోనూ విడుదల అయిన ఈ సినిమా.. అక్కడ కూడా మంచి సక్సెస్‌ను అందుకుంది.
సినిమా కథేంటంటే(Virupaksha)
రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథ ఇది. చేతబడి చేస్తూ చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ ఆ ఊరికి వచ్చిన ఓ జంటని సజీవ దహనం చేస్తారు గ్రామస్థులు. వారు మంటల్లో కాలిపోతూ 12 ఏళ్లు అంటే పుష్కర కాలం తర్వాత ఈ ఊరు వల్లకాడు అయిపోతుందని శపిస్తారు. అందుకు తగ్గట్టే సరిగ్గా పన్నెండేళ్ల తర్వాత ఆ ఊళ్లో వరుసగా మరణాలు సంభవిస్తాయి. దాంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని తీర్మానిస్తారు ఆ ఊరి పెద్దలు. అయినా సరే మరణాలు మాత్రం ఆగవు. తన తల్లితో కలిసి రుద్రవనంలోని బంధువుల ఇంటికి వచ్చిన సూర్య.. తాను ప్రేమించిన నందిని ప్రాణాల్ని కాపాడటం కోసం అక్కడే ఉంటాడు. ఈ చావుల వెనకున్న రహస్యాలు ఏంటా అని తెలుసుకునే పనిలో పడతాడు. మరి సూర్య తాను అనుకున్నది చేశాడా? ఈ వరుస చావుల వెనక ఎవరున్నారనే ఆసక్తికర నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.