Tollywood News: పుట్టపర్తి సత్యసాయిబాబా గురించి తెలియని వారుండరు. ఆయనను భక్తులు కదిలే దైవంగా చూస్తారు. దేశవిదేశాల నుంచి ఆయనకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అలాంటి స్వామి గురించి నేటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే మంచి సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై చిత్రం తెరకెక్కుతుంది.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నాడు హైదరాబాద్ సారధి స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ను వైభవంగా ప్రారంభించారు. సాయిప్రకాష్ దర్శకత్వంలో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న 100వ సినిమాగా సత్యసాయి అవతారం సినిమా ఉండడం విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు ప్రముఖ డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్ కొట్టి ప్రారంభించగా, కె. అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్ చేశారు. ఎస్.వి. కృష్ణారెడ్డి తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటించబోతున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమాను రెగ్యులర్ షూటింగ్ చేస్తామని డైరెక్టర్ తెలిపారు.
నేను కూడా స్వామి వారికి పరమ భక్తురాలిని అని నటి శివపార్వతి తెలిపారు. గతంలో ఆయనపై వచ్చిన సీరియల్‌లో కూడా తాను నటించడం జరిగిందని మళ్లీ స్వామిపై వస్తున్న సినిమాలో నటించడం నిజంగా ఆ స్వామి కృప, కటాక్షాల వల్లనే అని భావిస్తున్నానని ఆమె తెలిపింది.
ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. 15 కేటగిరీల్లో పోటీ