Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మెగా ఇంట్లో మరో వారసురాలు అడుగుపెట్టింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొనిదెల మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లైన సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. దీనితో మెగా కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అపోలో ఆసుపత్రి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఇక సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీకి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజున మహాలక్ష్మి పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని మెగాస్టార్ మురిసిపోయారు.
ఎంత మంది మహాలక్ష్ములు అంటే(Mega Star Chiranjeevi)..
కాగా మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉన్నారు. రామ్ చరణ్ కూతురు రాకతో ఆ సంఖ్య కాస్తా ఐదుకు చేరింది. మెగాస్టార్‌కు మొత్తం ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు అని అందరికీ తెలిసిందే. పెద్ద కుమార్తె సుస్మితకు సమర, సంహిత అనే ఇద్దరు ఆడపిల్లలు కాగా.. చిన్న కూతురు శ్రీజకు కూడా నివృతి, నవిష్క అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇలా చిరంజీవి ఇద్దరి కుమార్తెలకి ఇద్దరిద్దరు కూతుళ్లు చొప్పున మొత్తం నలుగురు మహాలక్ష్ములు ఉన్నారు. కాగా ఇక ఇప్పుడు రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఓ ఆడబిడ్డకే జన్మనివ్వడంతో చిరంజీవి ఇంట మొత్తం ఐదుగురు మనువరాళ్లు అడుగుపెట్టినట్లయ్యింది. మొత్తానికి మహాలక్ష్ములతో మెగాస్టార్ ఫ్యామిలీ కళకళలాడుతోందని అభిమానులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మనవరాలి విషయంలో కలిసొచ్చిన చిరుకు తన సెంటిమెంట్ కలిసొచ్చిందని అంటున్నారు. తాము ఆంజనేయ స్వామిని నమ్ముకున్న కుటుంబం అని.. కాగా మంగళవారం రోజునే స్వామివారి వర ప్రసాదంగా తమ ఇంట పాప జన్మించడం ఎంతో అపురూపం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్‌చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. నా కుటుంబం ఆంజనేయ స్వామినే నమ్ముకున్నాం. ఆ స్వామికి చెందిన మంగళవారం రోజున అమ్మాయిని ప్రసాదించటం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఈ పాప ఎంతో అపురూపం. చాలా సంవత్సరాల నుంచి వాళ్లు తల్లిదండ్రులై తమ పిల్లలను మా చేతిలో పెట్టాలని కోరుకున్నాం. ఇన్నేళ్లకు ఆ భగవంతుడి దయ వలన మా కోరిక నేరవేరింది. మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే వారందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.