Balagam: పల్లె జనం బంధం అనుబంధాల కలయికతో ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. ఓ పక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఈ సినిమా కోసం ప్రజలు థియేటర్లకు ముందు కిక్రిరిసిపోతున్నారంటేనే ఈ మూవీ ప్రజల్లో ఎంతటి ప్రభావం చూపిందో తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని ఊర్లలో ఐతే తెరలు కట్టుకుని మరీ.. ఊరిజనమంతా కలిసి కట్టుగా ఈ సినిమాను చూస్తున్నారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పిల్లా జల్లా ముసలీ ముతకా ఇలా అందర్నీ బలగం మూవీ ఆకట్టుకుంటోంది. ఈ ఉరుకుపరుగుల లైఫ్ లో బంధాలు కనుమరుగవుతున్న రోజుల్లో మనిషి మనసుల్లో కూరుకుపోయిన భావోద్వేగాలను తట్టి మరీ లేపుతుంది ఈ సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో సైతం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బలగం మూవీ పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది. అయితే ఇందులో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే బలగం మూవీ ఆస్కార్ దారిలో పయనిస్తోంది.
కమెడియన్ జబర్దస్త్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన బలగం మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా మారింది. ఇక్కడే కాకుండా బలగం మూవీ లాస్ ఏంజిల్స్ నిర్వహించిన సినిమాటోగ్రఫీ అవార్డుల వేడుకల్లోనూ తళుక్కుమంది. బెస్ట్ పీచర్ ఫిల్మ్.. అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీగా కేటగిరీల్లోనూ ఈ మూవీ అవార్డులను గెలుపొందింది. అంతేకాకుండా వాషింగ్ టన్ డీసీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఈ మూవీ ఏకంగా 4 కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా తాజాగా ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిలిం ఫెస్టివల్‌లో బలగం తన బలాన్ని చూపించింది. బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో బలగం మూవీ అవార్డును కైవసం చేసుకుంది. ఇలా బలగం సినిమా గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్లో పయనమవుతున్న సినిమాగా బలగం ఉందని కనిపిస్తోంది.
ఇక ఈ నేపథ్యంలోనే బలగం మూవీని ఆస్కార్ బరిలో నడిపించేందుకు బడ్జెట్ ఇవ్వడానికి రెడీ ఉన్నట్టు ఇటీవల కాలంలోనే దిల్ రాజు చెప్పడం సినీ ఇండస్ట్రీ నాట హాట్ టాపిక్ గా మారింది. దానితో ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు నుంచి ఆస్కార్ బరిలో నిలిచే సినిమాగా బలగం మారనుందని తెలుస్తోంది. దీనితో తెలుగు సిండస్ట్రీ, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.