Ram Charan Express condolences over tragic fan accident: అభిమానుల మృతిపై రామ్ చరణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.
అలాగే గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్ రాజు సైతం రూ. 5 లక్షల చొప్పున పది లక్షల ప్రకటించారు. తాజాగా ఈ ఘటనపై రామ్ చరణ్ కూడా స్పందించారు. అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తన మనుషులు బాధితులు ఇంటికి పంపించి వారి ధైర్యం చెప్పారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ మేరకు రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరుకునేది కూడా అదే. ఈ విషయాన్ని ఈవెంట్‌లో కూడా ఒకటికి రెండు సార్లు బాబాయ్ చెప్పారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అని సంతాపం తెలిపారు.
కాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఫ్యాన్స్‌ని హెచ్చరించారు. అభిమానులంత ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని పదే పదే చెప్పారు. అయినా ఇలాంటి ఘటన జరగడంతో ఆయన ఆవేదనకు లోనయ్యారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు. అలాగే ఇరు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.