Narendra Modi Praises Akkineni Nageswara rao: తెలుగు నట దిగ్గజం, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ క్రమంలో నట సామ్రాట్ అక్కినేని గురించి ప్రస్తావించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన భారత సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయని, వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు నిర్వహించబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇక నేషనల్ వేదికైన మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని మన తెలుగు సినీ దిగ్గజమైన అక్కినేని ప్రస్తావన తీసురావడంతో తెలుగు ప్రేక్షకులు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది అక్కినేని శత జయంతి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన శత జయంతి సందర్భంగా గోవాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు అందించి.. శత జయంతిని పూర్తి చేసుకున్న నటులను ఈ స్టేజ్‌పై గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆయన శత జయంతి సందర్భంగా ఇఫీలో ఆయనను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.