Nandamuri Alekhya Reddy : నందమూరి తారకరత్న తారకరత్న మరణించి మార్చి 18వ తేదీకి నెల రోజులు గడిచింది. అయినప్పటికీ తారక రత్న మరణ వార్తను ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాలు ప్రస్తావించారు. అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ద్వారా తారకరత్న నిరాధరణకు గురయ్యాడని, తల్లిదండ్రులు దూరం పెట్టి వేదనకు గురి చేశారని ఆమె చెప్పకనే చెప్పారు.
ఆ పోస్ట్ లో.. ”మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం.. మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ.. మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్ అని రాసుకొచ్చారు”. అలానే కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. అయిన వాళ్లే పదే పదే మనల్ని బాధపెట్టారు. కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. పిల్లలు పుట్టాక మన జీవితం మారిపోయింది. పెద్దమ్మాయి నిష్కమ్మ జన్మించిన తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. 2019లో కవలలు జన్మించడం తమకు సర్‌ప్రైజ్ అన్నారు.
ప్రశాంతత, సంతోషం ఉన్న చోటు మళ్ళీ మనం కలుద్దాం – అలేఖ్య రెడ్డి
ఇంకా ఆమె మాట్లాడుతూ ”నువ్వు (తారక రత్న) గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరూ ఆ బాధను చూడలేదు. కష్టాల్లో నేను నీకు సాయం చేయలేకపోయా. మన ప్రయాణం మొదలైన తరుణం నుంచి చివరకు వరకు… మనకు అండగా ఉన్న వ్యక్తులు మాత్రమే మనతో ఉన్నారు. నువ్వే మా రియల్ హీరో ఓబు. కుటుంబంగా నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. ప్రశాంతత, సంతోషం ఉన్న చోటు మళ్ళీ మనం కలుద్దాం” అని ఎమోషనల్ అయ్యారు. చివరగా మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తారకరత్నతో అలేఖ్య రెడ్డికి రెండో వివాహం. ఆయన హీరోగా తెరకెక్కిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. అప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో మిత్రుల మధ్య నిరాడంబరంగా తారకరత్న వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు. 2014లో జరిగిన తన సోదరి రూప పెళ్లికి కూడా తారకరత్న వెళ్లలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.