Director Ashokan: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కేరళ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ధృవీకరించింది.
అశోకన్ అసలు పేరు రామన్ అశోక్ కుమార్(60). 1980లో దర్శకుడు శశి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అశోకన్ తన కెరీర్‌ను ఆరంభించారు. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘వర్ణం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. రెండో చిత్రమైన ‘ఆచార్యన్’ ఇతనికి క్రేజ్ తీసుకువచ్చింది. 2003లో అశోకన్ దర్శకత్వం వహించిన మలయాళ ‘కైరాలీ’ టీవీలో ప్రసారమైన ‘కనప్పురమున్’ ఉత్తమ టెలిఫిల్మ్ గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది.
చేసింది తక్కువ చిత్రాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా అశోకన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘పూరీ‘ పై ఫస్ట్ షాట్ తీయగానే ఆశ్చర్యపోయారు.. మెగాస్టార్ చిరంజీవి