Liger Movie : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ‘లైగర్’. గత ఏడాది ఆగష్టు 25న పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ మూవీ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్య కృష్ణ ముఖ్య పాత్ర పోషించింది. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి, రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంబోలో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా ‘లైగర్’ మూవీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమ్మె బాట పట్టారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే దీక్షకు దిగారు. ‘లైగర్’ సినిమాతో భారీగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు. ‘లైగర్’ ద్వారా నష్టపోయిన వాళ్లకు డబ్బులు ఇస్తానన్న పూరీ, ఇప్పటికైనా హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనపై పూరీ సైడ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
అయితే ఈ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఇటీవలే ఈడీ విచారణ జరిగింది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు సుమారు 12 గంటల పాటు విచారించారు. హీరో విజయ్ దేవరకొండను కూడా విచారణ చేశారు.
కాగా ‘లైగర్’ కోసం తమ నష్టాలు పూడ్చుకోవడనికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూరిపై గతంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అందుకు గాను పూరికి సంబంధించిన ఓ ఆడియో విడుదలై సంచలనం కలిగించింది. తాను డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేకపోయినా, బయ్యర్లు నష్టపోయారని ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు అందులో పూరి చెప్పారు. కొద్ది రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పినా, కొంత మంది ధర్నాలు చేస్తామని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ”ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే.. మనలను పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడు అయినా మోసం చేస్తే? దగా చేస్తే? అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే! ప్రేక్షకులను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు” అని మీడియాకు రాసిన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. తన ప్రేక్షకులకు మాత్రమే తాను జవాబుదారీ అని ఆయన వివరించారు. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళను ఎంటర్‌టైన్ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఈ సమస్య వినిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ధర్నా చేయడంతో ఏఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.