Site icon Prime9

Kota Srinivasarao : నేను బ్రతికే ఉన్నాను.. డబ్బు సంపాదించడానికి.. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు – కోట శ్రీనివాసరావు

kota srinivasarao response about fake news about his death

kota srinivasarao response about fake news about his death

Kota Srinivasarao : విలక్షణ నటుడు కోట శ్రీనివాస‌రావు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషాల్లోనూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు కోట. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.  సినీ రంగంలో రాణించాల‌నుకునే అప్ క‌మింగ్ యాక్టర్లలో చాలా మంది కోట‌ శ్రీనివాస రావును స్పూర్తిగా తీసుకుంటారు. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూ.. యువ న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో వస్తున్న ఫేక్ వార్తలకు కొదువే లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం నుంచి కోట శ్రీనివాసరావు మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇవ్వడంతో అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికి నేను కనీసం 50 ఫోనులు మాట్లాడాను – కోట (Kota Srinivasarao)

ఈ మేరకు ఒక వీడియో విడుదల చేసిన కోట శ్రీనివాస రావు అందులో మాట్లాడుతూ.. ”తెల్లవారితే ఉగాది.. పండగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరో సోషల్ మీడియాలో ‘కోట దుర్మరణం’ అని వేశారట. దాంతో ఉదయం నుంచి ఒక్కటే ఫోనులు. ఇప్పటికి నేను కనీసం 50 ఫోనులు మాట్లాడాను. మా కుర్రాడు కొన్ని ఫోనులు మాట్లాడాడు. వ్యాను వేసుకుని పది మంది పోలీసులు వచ్చారు. పెద్దాయన మరణిస్తే ప్రముఖులు వస్తే సెక్యూరిటీ కావాలని వచ్చామని చెప్పారు. ఇటువంటి  వార్తలు నమ్మవద్దని మనవి చేస్తున్నా అని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడానికి జీవితంలో చండాలపు పనులు బోలెడు ఉన్నాయని, మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, ఇటువంటి పనులు అక్కర్లేదని ఆయన చెప్పారు. అయితే ఆ వార్త నిజమని నమ్మిన పోలీసులు కూడా ఆయన ఇంటికి వెళ్లారట. ప్రముఖ నటుడు కావడంతో పలువురు సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉన్నందున బందోబస్తు అవసరం అవుతుందని వచ్చామని చెప్పారట. దాంతో వారితో కూడా కోట మాట్లాడి ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కువ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ప్రస్తుతం కోట శ్రీనివాస రావు వయసు 75 ఏళ్ళు. వయస్సు రీత్యా ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికి నటనకు విరామం ఇవ్వకుండా ఛాన్స్ ఉన్నప్పుడల్లా వెండితెరపై మెరుస్తూనే ఉంటున్నారు. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన కబ్జ సినిమాలో కూడా కోట నటించారు. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ సినిమాలో సుదీప్, శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. సుమారు 750 సినిమాల్లో ఆయన నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదని చెప్పాలి.

Exit mobile version