K Viswanath Wife: కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే అపోలో హాస్పటిల్ కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యంతో కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడం విషాదకరం. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీ ప్రియులు శోకసంద్రంలో మునిగి పోయారు. జయలక్ష్మీ అంత్యక్రియం సోమవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి.
అలా.. ఇలా ఉన్నాయని విశ్లేషణ ఉండదు(K Viswanath Wife)
20ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్ .. జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి నాటికి విశ్వనాథ్ జీవితంలో స్థిరపడకపోయినా.. తల్లిదండ్రులు చెప్పడంతో వివాహానికి ఒప్పుకున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి సినిమా విషయాల్ని ఆయన ఎప్పుడూ ఇంట్లో చర్చించే వారు కాదట.
తన భార్య తన సినిమాల్ని చూసి అలా.. ఇలా ఉన్నాయని విశ్లేషించదని.. బాగుంది అని మాత్రమే చెబుతుందని విశ్వనాథ్ ఓ సందర్భంలో తన సతీమణి గురించి చెప్పారు.
విశ్వనాథ్, జయలక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతి దేవి. అబ్బాయిలు కె. నాగేంద్రనాథ్, కె. రవీంద్రనాథ్. చిత్ర పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో వారికిష్టమైన రంగాల్లో విశ్వనాథ్ పిల్లలు స్థిరపడ్డారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.