Alia Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ (93) గురువారం కన్ను మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్.. వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తాతయ్య మరణవార్తలను ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని అలియా పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది.
చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చావు(Alia Bhatt)
‘తాతయ్యా.. నువ్వే నా హీరో.. 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. 93 ఏళ్ల దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నా కోసం రుచికరమైన ఆమ్లెట్ చేసేవాడివి. బోలెడన్ని కథలు చెప్పేవాడివి.. వయోలిన్ వాయించేవాడివి. ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు. నవ్వు క్రికెట్ ఆడే విధానం అన్నా.. నీ స్కెచ్‌లన్నా ఎంతో ఇష్టం. నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని ప్రేమించావు. ఇప్పుడు నువ్వు లేవనే బాధతో నేను దుఃఖంతో నిండిపోయా.
అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు చెప్పలేనంత సంతోషాన్ని అందించాడు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునే వరకు దాన్ని అలాగే భద్రంగా దాచుకుంటాను’ అని అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుకు తన తాతయ్య కు ఇటీవల జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో యాడ్ చేసింది ఆలియా భట్.