TSPSC Group 2: తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. దానికి తగినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఒక్కొక్కటిగా పరీక్ష తేదీలను టీఎస్పీఎస్పీ ప్రకటిస్తు వస్తుంది. తాజాగా గ్రూప్ -2 కు సంబంధించిన పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించింది.
పరీక్షలు ఎప్పుడో తెలుసా? (TSPSC Group 2)
రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్- 2 పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆగస్టు చివర్లో.. అనగా 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిని అధికారులు తెలిపారు. ఇదివరకే 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసింది. జూన్ 5 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు, జులై 1న గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.
ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ..
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి భారీగా పోటి నెలకొంది. మెుత్తం 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. జనవరి 18నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
గ్రూప్ 2 పరీక్ష విధానం ఇలా ఉంటుంది..
గ్రూప్ 2 పరీక్షలో మెుత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్ I, పేపర్ II, పేపర్ III మరియు పేపర్ IV అనే నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్, హిస్టరీ & సొసైటీ, ఎకానమీ డెవలప్‌మెంట్ తెలంగాణా ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటుగా సమానంగా సిలబస్ ఉండనుంది. ప్రతి పేపర్.. 150 మార్కులు ఉండనుంది. అంటే వ్రాత పరీక్ష మొత్తం 600 మార్కులకు ఉంటుంది.