Site icon Prime9

TS Police Jobs 2022: రేపటి నుంచి ఎస్సై కానిస్టేబుల్ పార్ట్-2 అప్లికేషన్లు షురూ

telangana police recruitment part-2 application

telangana police recruitment part-2 application

TS Police Jobs 2022: తెలంగాణలో ఇటీవల పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చెయ్యడానికి పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు కూడా తాజాగా విడుదలయ్యాయి. అయితే ఈ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్‌-2 దరఖాస్తు ప్రక్రియ రేపట్నుంచి (అక్టోబర్ 27) ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ దశలో అభ్యర్ధులు ముందుగా అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవల్సి ఉంటుంది.

ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హులైనవారందరూ తదుపరి దశగా పిలిచే ‘పార్ట్‌-2’ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో సర్టిఫికేట్లను అప్‌లోడ్‌ చేసేందుకు అక్టోబ‌రు 27 నుంచి నవంబరు 10 వరకు అవకాశం ఇచ్చింది. అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు. కాగా తెలంగాణ ప్రభుత్వం 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. కాగా వారిలో 2.69 లక్షల మంది అర్హత సాధించారు. అర్హులైన వారు తుది గడువు వరకు వేచి చూడకుండా ముందుగానే సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచిస్తోంది.

దీనికి గాను 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే వారిని స్థానికేతరులుగా పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు నాన్‌లోకల్‌ కోటాలో 5 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే క్యాస్ట్‌ (కుల ధ్రువీకరణపత్రాలు) సర్టిఫికెట్‌ కూడా కీలకమైనది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా జనరల్‌ కేటగిరీగా పరిగణించే అవకాశం ఉంది.

అప్ లోడ్ చెయ్యవలసిన సర్టిఫికేట్ వివరాలు

1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నేటివ్‌ సర్టిఫికెట్‌, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల షీట్, డిగ్రీ మార్కుల షీట్, ఇంటర్‌ మార్కుల షీట్, కాస్ట్ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, బీసీ అభ్యర్థులకు 2021 ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన నాన్‌-క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్‌, సర్వీస్‌ సర్టిఫికెట్‌, మాజీ సైనికోద్యోగులు/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా ఉద్యోగాల కోసం పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ లేదా డిశ్ఛార్జి బుక్‌ వంటివి ఆన్ లైన్ లో అప్ లోడ్ చెయ్యాలని రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది.

ఇదీ చదవండి: న్యాయస్థానాల్లో 3,673 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Exit mobile version