TTD Decided To Issue Divya Darshanam tokens At Alipiri: తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడకన తిరుమల కొండకు వెళ్లే భక్తులకు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. 4 కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను అందిస్తారు. అయితే గత కొద్ది రోజులుగా శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలోనే శాశ్వతంగా దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటివరకు భూదేవి కాంప్లెక్స్ దివ్యదర్శన టోకెన్లు అందించనున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసే సమయం వస్తుండడంతో రద్దీ మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కాంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. నిన్న రాత్రి వరకు స్వామివారిని 78,288 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,079 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.