Indrakeeladri: దసరా శరన్నవ రాత్రుల పర్వదినాల పవిత్రతను భక్తుల దరిచేర్చేందులో ఏపీ దేవదాయ శాఖ వెనుకబడి పోయింది. పలు కీలక ఆలయాల్లో సాంప్రదాయ పద్దతులకు తిలోదకాలు వదలడంతో భక్తులు ఇక్కట్లు పాలౌతున్నారు. రాజకీయ నేతల ప్రభావం, చిత్తశుద్ధి లేని దేవదాయ శాఖ అధికారుల పనితీరుతో కొండంత ఆశగా వచ్చిన భక్తులు కలతలు చెందుతున్నారు.
వివరాల్లోకి వెళ్లితే, ప్రముఖ శక్తి దేవాలయాల్లో ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. దేవి నవరాత్రుల్లో ఆలయానికి లక్షల్లో భక్తులు విచ్చేసి అమ్మణ్ణి దర్శన భాగ్యాన్ని అందుకొంటుంటారు. ఈ క్రమంలో శరన్నవ రాత్రుల్లో ఉభయదాతలే ఎంతో ప్రధానంగా ఉంటారు. పూజ కార్యక్రమాలను వారి చేతుల మీదుగా జరుపుతూ ఆలయ విశిష్టతను మరింతగా భక్తుల దరిచేరుస్తుంటారు.
కాని ఇంద్రకీలాద్రి పై అధికారుల తీరు వివాదస్పదంగా మారింది. మంత్రులను సైతం ఆలయం లోపలకు వెళ్లేందుకు నిలబడాల్సి వస్తుంది. మద్యం సేవించిన సిబ్బంది విధులు నిర్వహిస్తూ పవిత్రతకు కళంకం తెస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది చేష్టలతో అర్చకులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలౌతున్నారు. గడిచిన 3రోజుల్లో ఎన్నో ఘటనలు చోటుచేసుకొన్నా అధికారుల తీరులో మాత్రం మార్పులు రావడం లేదు.
తాజాగా కుంకుమ పూజలో కూర్చున్న ఉభయ దాతలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు తమను గౌరవించి పూజలు చేయించేవారని, ఇప్పుడు కనీసం పట్టించుకునేవారుకూడా లేరని ఉభయ దాతలు ఆరోపిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమాలు ఎంతో విశిష్టంగా జరుగుతాయి. పలువురు భక్తులు మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొంటున్నామని, ఎంతో ఘనంగా జరిగేవని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఇంద్రకీలాద్రిలో కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయ దర్శనం కల్పించడం లేదని, టిక్కట్ తీసుకుని వచ్చినా, తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
రూ. 3వేల టిక్కెట్ తీసుకుని కింద నుంచి కొండ పైకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రతి ఏడాది లిఫ్ట్ ద్వారా పైకి వచ్చేవాళ్లమని, ఇప్పుడు ఆ సౌకర్యం లేదని, వయసు మీరిన వారు కింద నుంచి పైకి మెట్లు ఎక్కి రావడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ప్రశాంతంగా కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించి, అంతరాలయ దర్శనం కల్పించాలని కోరుతున్నామని విజ్నప్తి చేసుకొంటున్నారు.
ఇది కూడా చదవండి:MLC Madav: ఏపీలో మాకు తోడు జనసేనే.. ఎమ్మెల్సీ మాధవ్