Prime9

Tirumala: తిరుమలలో నేటి నుంచి జ్యేష్టాభిషేకం.. దర్శనానికి 24 గంటల సమయం

Devotees: కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతుంటాయి. కాగా నేటి నుంచి శ్రీవారికి సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. నేటి నుంచి జూన్ 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేలా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ వేడుకను అభిద్యేయక అభిషేకం అంటారు. అభిషేకాలతో ప్రాచీన కాలం నుంచి ఉన్న ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ వేడుక చేయనున్నారు.

 

మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేససి, హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండోరోజు ముత్యపు అంగి సమర్పిస్తారు. మూడోరోజు తిరుమంజనాలు సమర్పించి బంగారు కవచం తిరిగి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల నారాయణగిరి వనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం అవుతోంది. నిన్న శ్రీవారిని 90,802 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,776 భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.

Exit mobile version
Skip to toolbar