Tirumala: హిందువుల విశ్వాసం ప్రకారం ముక్కోటిదేవతామూర్తులు ఉంటారని విశ్వాసం. అయితే ఒక్కొక్కరి ఒక్కో ప్రత్యేకత ఒక్కోరోజు ప్రత్యేకమైన పర్వదినంగా చెప్తుంటారు. అలాగే త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన రోజు ఏకాదశి అని ప్రగాఢ విశ్వాసం. ఏడాదిలో ప్రతినెలలో రెండు ఏకాదశులు వస్తాయి. అలా వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంది. అయితే ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని.. దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. హిందువులకు తొలి ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు, స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తుంటారు.
తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు శ్రీ మహా విష్ణువు నిద్రపోతాడు. త్రిమూర్తులు లేకుండా ఏ శుభకార్యాలను చెయ్యరు కదా అందుకనే ఈ నాలుగు నెలల్లో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు. తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విష్ణు రూపాలుగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలు వంటి ఆలయాల్లోనైనా భక్తుల సందడి నెలకొంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అలిపిరి నడకదారి నుంచి స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య అధికంగా ఉంది. మెట్ల మీద భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని చేరుకోవాటానికి పయనిస్తున్నారు. గోవింద గిరులు భక్తులు గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి.