Uttarakhand: శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్, తీర్థపురోహిత్ మరియు రుద్రప్రయాగ్ జిల్లా పరిపాలన అధికారులతో పాటు 3,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది 43 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్‌లోనే 15,61,882 మంది భక్తులు ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ హరీష్ గౌర్ మాట్లాడుతూ కేదార్‌నాథ్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 3 గంటలకు తెరిచామని, శీతాకాలం కోసం తలుపులు మూసివేసే ప్రక్రియ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైందని తెలిపారు
యమునోత్రి ఆలయం కూడ గురువారం మూసివేయబడుతుంది. బద్రీనాథ్ ఆలయం నవంబర్ 19న మూసివేస్తారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రి అనే నాలుగు హిమాలయ దేవాలయాలు శీతాకాలం మంచుతో కప్పబడి ఉన్నందున ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. చార్ ధామ్ యాత్రకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.