Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లు ప్రారంభమైనా, పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోయినా ఇంకా భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే నిన్న, ఇవాళ వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల నారాయణగిరి వనం, సేవాసదన్ వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో సర్వదర్శనం చేసుకునే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.
మరోవైపు నిన్న శ్రీవారిని 91,270 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పాలు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీ చేసింది.