Bathukamma: బతుకమ్మ పండగ ఎలా జరుపుకుంటారంటే..!

వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 10:47 AM IST

Bathukamma festival: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది.

చరిత్ర ప్రకారం..

బతుకమ్మ పండుగకు సంబంధించి చరిత్రను ఒకసారి చూసుకుంటే మనకు చాలా ఆధారాలు కనిపిస్తాయి. గొల్లరాజుల కాలంలో కొందరు వ్యక్తులు ఈ బతుకమ్మ సంబరాలను మొదలుపెట్టారని చెబుతుంటారు. మరికొందరు ఐతే మాందాత కాలంలో ఈ పండుగను చేసుకుంటారు. అందుకు ప్రతీకగా సిద్ధిపేట, హుస్నాబాద్ సమీపంలోని మాందాపురంలో బతుకమ్మ పురాతన శిల్పాలు మనకి కనిపిస్తాయి.

పురాణాలను పరిశీలిస్తే..

బతుకమ్మకు సంబంధించి పురాణ కథలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జగన్మాత కథ. పురాణాలను పరిశీలిస్తే మహిషాసురుడిని వధించేందుకు వచ్చిన జగన్మాత నిద్రలోకి వెళ్ళిందట. ఆ సమయంలో జగన్మాతను నిద్ర లేపేందుకు ఆడవాళ్ళు అందరూ కలిసి పాటలు పాడినప్పుడు,‘బతుకమ్మ’ పేరిట జగన్మాతను ఆరాధించారట. అలా తొమ్మిదిరోజుల పాటు జగన్మాత కోసం పాటలు పాడిన తర్వాత ఆమె నిద్ర నుంచి లేచిందట.ఇక అప్పటినుంచి జగన్మాత దేవత స్థానంలో పూలను పేర్చి బతుకమ్మను ప్రతి ఏటా పూజించడం ఒక సంప్రదాయంగా మారిందట.

ఎలా జరుపుకుంటారంటే..

బతుకమ్మ సంబరాల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కల్లాపి జల్లి, ఆ తర్వాత పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరి దేవిని ఉంచి, అగర్ బత్తీలను కూడా పెట్టి, సువాసనను పీలుస్తూ పూల చుట్టూ తొమ్మిదిసార్లు తిరుగుతారు. ఆ తర్వాత ఊరంతా కలిసి గుడి దగ్గర కానీ లేదా చెరువు గట్టుకు వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆటలను ఆడతారు.